చదివింది ఒకటి.. సర్టిఫికెట్‌ మరొకటి! | - | Sakshi
Sakshi News home page

చదివింది ఒకటి.. సర్టిఫికెట్‌ మరొకటి!

Jun 5 2026 1:18 AM | Updated on Jun 5 2026 1:18 AM

జీఎన్‌ఎం నర్సింగ్‌ వారూ బీఎస్సీ నర్సింగ్‌ ధ్రువపత్రం సమర్పణ గతం నుంచే విధులు నిర్వహించినట్లు నకిలీ సర్టిఫికెట్లు పిడుగురాళ్ల జీజీహెచ్‌ నర్సింగ్‌ పోస్టుల భర్తీలో మాయాజాలం ప్రలోభాలకు లోనై ఆమోదించిన కార్యాలయ అధికారులు

గుంటూరు మెడికల్‌: చదివింది జీఎన్‌ఎం నర్సింగ్‌ కోర్సు.. కానీ ఉద్యోగం పొందేందుకు బీఎస్సీ నర్సింగ్‌తో పనిచేసినట్లు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు పెట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్‌లో 150 కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సుల పోస్టులు భర్తీ చేసేందుకు గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) మార్చి నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన సుమారు 7 వేల మందికిపైగా అభ్యర్థులు జీఎన్‌ఎం నర్సింగ్‌, బీఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను ఆర్డీ కార్యాలయం అధికారులు స్క్రూట్నీ చేసి మే 14 నుంచి 19వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు గడువు ఇచ్చి, ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేశారు. పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మే 29న విడుదల చేసి 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యంతరాలు వ్యక్తం చేయాలని అధికారులు ప్రకటన విడుదల చేయడమేంటని అన్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సమయం సరిపోదని, మామూళ్లు ఇచ్చి నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వారికి ఉద్యోగాలు వచ్చేలా ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫైనల్‌ మెరిట్‌ జాబితాలో తొలి 500 మంది అభ్యర్థుల్లో 50 మంది వరకు నకిలీ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు.

ఆరోపణలకు ఆధారాలు ఇవే

కరోనా సమయంలో ఉద్యోగాలు చేసేందుకు 2020 ఆగస్టులో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నోటిఫికేషన్‌లు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం పిడుగురాళ్ల జీజీహెచ్‌ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన వారిలో పలువురు ఆగస్టుకు ముందే అంటే నోటిఫికేషన్‌ విడుదలకు ముందే ఉద్యోగాల్లో చేరి పనిచేసినట్లు 2020 ఏప్రిల్‌, మే నుంచి పనిచేస్తున్నట్లు సర్టిఫికెట్లు పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారు ఎంఎల్‌హెచ్‌పీగా ఉద్యోగం చేస్తూ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ పెట్టారు. ఎంఎల్‌హెచ్‌పీలను ప్రస్తుతం సీహెచ్‌ఓలుగా పిలుస్తున్నారు. అయితే జీఎన్‌ఎం కోర్సు చదివిన అభ్యర్థులకు ఎంఎల్‌హెచ్‌పీ విధులు నిర్వహించినట్లు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు జత చేసి, వారి పేర్లు సీనియార్టీ జాబితాలో ముందు వచ్చేలా చేయడం తగదని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement