టీడీపీ మండల అధ్యక్షుడి దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

టీడీపీ మండల అధ్యక్షుడి దౌర్జన్యం

Jun 5 2026 1:18 AM | Updated on Jun 5 2026 1:18 AM

వైఎస్సార్‌ సీపీ శాంతియుత నిరసన వద్ద గొడవకు యత్నం కుటిల బుద్ధిని చాటుకున్న టీడీపీ, జనసేన నాయకులు ఎట్టకేలకు పోలీసుల జోక్యంతో సమసిన వివాదం

కొల్లూరు: అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతూ యథేచ్ఛగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టేందుకు ప్రజా క్షేత్రంలో బాహాబాహీకి దిగిన టీడీపీ, జనసేన నాయకులు బరితెగించి వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దౌర్జన్యం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. వారిని దీటుగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఎదుర్కొన్నాయి. టీడీపీ మండల నాయకుడి సవాలుకు ప్రతి సవాలు విసరడంతో గురువారం కొల్లూరు బస్టాండ్‌ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కొల్లూరు బస్టాండ్‌ సెంటర్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు నిరసన ఆరంభించాయి. ఇంతలో టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, జనసేన కార్యకర్త, మరో టీడీపీ నాయకుడితో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులను ఉద్దేశించి అభ్యంతరకర రీతిలో సంబోధిస్తూ నిరసన కార్యక్రమాన్ని దౌర్జన్యంగా అడ్డుకునే ప్రయత్నానికి పూనుకున్నాడు. అప్పటికే అక్కడున్న ఎస్‌ఐ పి. కోటేశ్వరరావు ఆయనను నిలువరించి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన వెంట వచ్చిన జనసేన, టీడీపీ కార్యకర్తలు ఇరువురు వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై వ్యాఖ్యలు చేస్తూ దూసుకురావడం ఉద్రిక్తతకు దారితీసింది. అంతవరకు సహనం వహించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు... హామీల అమలులో వైఫల్యం, టీడీపీ అవినీతిపై చర్చకు సిద్ధమేనని తేల్చి చెప్పాయి. వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, ఎస్‌ఐ కోటేశ్వరరావు, సిబ్బంది ఇరు వర్గాలకు నచ్చ చెప్పి పంపేందుకు అష్టకష్టాలు పడ్డారు. బస్టాండ్‌ సెంటర్లో పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు బందోబస్తు నిర్వహించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement