● కాలువ వెంబడి పూడ్చివేతలు
● యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
● బ్రిడ్జి వద్ద కాలువ వెడల్పు పూడ్చివేత
● టాక్సీ స్టాండ్‌గా మారిన కాలువ గర్భం
● పట్టించుకోకుంటే 1996 వరద ముప్పు తప్పదు!
సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం నడిబొడ్డున ప్రవహించే చరిత్రాత్మక బుగ్గ కాలువకు కష్టకాలం వచ్చింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో సాగిన ఈ కాలువ, ప్రస్తుతం తన రూపురేఖలను పూర్తిగా కోల్పోతోంది. అక్రమార్కుల పూడ్చివేతలు, అడ్డగోలు కబ్జాల కారణంగా కాలువ గర్భం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అసలు పట్టణంలో కాలువ ఉందా లేదా అన్న స్థితికి చేరుకుంటున్నా, పరిరక్షించాల్సిన మున్సిపల్, రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
3 కిలోమీటర్ల పొడవునా విస్తరణ
మదనపల్లె పట్టణ పరిధిలో ఈ బుగ్గ కాలువ దాదాపు 3 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తూ కీలకమైన జలవనరుగా నిలుస్తోంది. పట్టణంలోని అనేక ప్రధాన మురికివాడలు, కాలనీల మీదుగా ఈ ప్రవాహం సాగుతుంది. బొమ్మనచెరువు రోడ్డు నుంచి ప్రారంభమై.. ఈశ్వరమ్మ కాలనీ, యాహల్లి లేఅవుట్, ముగ్గురాళ్ల వంక, వివేకానంద నగర్, చెంబకూరు రోడ్డు, వాల్మీకి వీధి, చిత్తూరు బస్టాండు, మున్సిపల్ కార్యాలయం పక్కనుంచి బాంబు బజార్ మీదుగా బాహుదా కాలువలో కలుస్తుంది. అక్కడి నుండి నిమ్మనపల్లె మండలంలోని ప్రతిష్టాత్మక బాహుదా ప్రాజెక్టులోకి చేరుకుంటుంది.
1996 వరద చేదు జ్ఞాపకాలు..
సురక్షిత మదనపల్లె సాధ్యమేనా?
బుగ్గ కాలువ ఆక్రమణల వల్ల భవిష్యత్తులో పట్టణానికి ఎంతటి ఘోర ముప్పు పొంచి ఉందో చెప్పడానికి గత చరిత్రే నిదర్శనం. 1996 జూన్ నెలలో మదనపల్లెకు భయంకరమైన వరదలు సంభవించాయి. అప్పట్లో బుగ్గ కాలువ, బాహుదాలు ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ ప్రమాదం తర్వాత అప్పట్లో అధికారులు బుగ్గ కాలువ వెంబడి ఉన్న ఆక్రమణలను కఠినంగా తొలగించి, బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు ఇచ్చారు. అయినప్పటికీ కాలక్రమేణా మళ్లీ కబ్జాలు చోటుచేసుకున్నాయి. కాలువ వెడల్పు నిరంతరం తగ్గిపోతుండటం వల్ల భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసి నీటి ప్రవాహాలు పొంగినప్పుడు 1996 నాటి విపత్కర పరిస్థితులు మళ్లీ తలెత్తడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టి, కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప బుగ్గ కాలువకు మోక్షం లేదు. సురక్షితమైన మదనపల్లె కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. లేదంటే భవిష్యత్తులో సంభవించే విపత్కర పరిస్థితులకు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది.
బుగ్గ కాలువకు ఇరువైపులా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమార్కులు మొదట కాలువకు ఇరువైపులా మెల్లగా మట్టిపోస్తూ పూడ్చివేస్తున్నారు. ఆ తర్వాత వాటిపై శాశ్వత పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల కాలువ వెడల్పు భారీగా తగ్గిపోయి, కొన్నిచోట్ల కేవలం సన్నటి వంకలా మారిపోయింది. మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న ప్రధాన బ్రిడ్జి కింద కాలువ అసలు వెడల్పు ఎంత ఉందో.. ఆ మేరకు ఆక్రమించి నిర్మాణాలు చేసేశారు. ప్రస్తుతం ఈ కాలువలో పాతిక భాగానికి పైగా పూర్తిగా పూడిపోయింది. కేవలం మిగిలిన కొద్ది భాగం మాత్రమే నీటి ప్రవాహానికి అనుకూలంగా ఉంది. ఎగువ నుంచి దిగువ వరకు ఇదే పరిస్థితి నెలకొన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.


