ఆశలు విత్తుకొనేనా! | - | Sakshi
Sakshi News home page

ఆశలు విత్తుకొనేనా!

Jun 15 2026 1:17 AM | Updated on Jun 15 2026 1:17 AM

సాక్షి, అన్నమయ్య : జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో అన్నదాతల్లో ఖరీఫ్‌ సాగుపై ఆశలు చిగురించాయి. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ సాగు లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు 60 వేల హెక్టార్లుగా నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే వరుణుడు కరుణించడంతో జిల్లా అంతటా సాగు పనులు మొదలుపెట్టేందుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. రెండు రోజుల్లో అత్యధికంగా గాలీవీడు మండలంలో 132 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. మిగిలిన అ్చన్ని మండలాల్లో కూడా వర్షాలు విస్తారంగా పడ్డాయి. నిజానికి ఈ ఖరీఫ్‌లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని, వర్షాలు సరిగ్గా కురవవని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేయడంతో రైతులు సాగుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనివల్ల ప్రారంభంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 490 హెక్టార్లలో వేరుశనగ విత్తగా.. ప్రస్తుతం కేవలం 228 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. ఈ మొత్తం సాగు లక్ష్యంలో సింహభాగం, అంటే దాదాపు 67 శాతం (40 వేల హెక్టార్లు) కేవలం వేరుశనగ పంట సాగుకే కేటాయించారు. ఇక 12 వేల హెక్టార్ల లక్ష్యంతో వరి పంట రెండో స్థానంలో ఉండగా, మొక్కజొన్న 3,500 హెక్టార్లు, కందులు 1,500 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టారు. రాగి, మినుములు, ఉలవలు, అలసందలు, అనుములు 500 హెక్టార్ల చొప్పున..జొన్న, సజ్జ 250 హెక్టార్ల చొప్పున కేటాయించారు.

తీరని విత్తనాల కొరత..

19 మండలాలకు శూన్యం!

వర్షాలు పడి భూమి పదునెక్కినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. సాగుకు అత్యంత కీలకమైన రాయితీ (సబ్సిడీ) విత్తనకాయలు ఇప్పటివరకు జిల్లాలకు పూర్తిస్థాయిలో చేరుకోలేదు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 43 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనకాయలు అవసరమని గుర్తించి, ప్రభుత్వం కూడా అంతే పరిమాణంలో బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. కానీ, ఆదివారం నాటికి జిల్లాకు సరఫరా అయింది అందులో 10 శాతం కూడా లేదు.ప్రస్తుతానికి కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు, కలికిరి, నిమ్మనపల్లి, మదనపల్లె మండలాలకు కలిపి కేవలం 4,447 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సరఫరా చేశారు. జిల్లాలోని మొత్తం 25 మండలాలకు.. ఇంకా 19 మండలాలకు కిలో విత్తనకాయలు కూడా సరఫరా కాలేదు. వర్షాలు పడిన వెంటనే జూలై 15 లోపు విత్తనాలు వేసుకోవాల్సిన తరుణంలో.. రాయితీ విత్తనాల పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విత్తనకాయలను సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లా అంతటా రెండు రోజులుగా

విస్తారంగా వర్షాలు

గాలీవీడులో అత్యధికంగా 132 మి.మీ నమోదు

ఖరీఫలో 60 వేల హెక్టార్ల సాగు లక్ష్యం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా

19 మండలాలకు చేరని విత్తనకాయలు

ఈ ఏడాది కేటాయించిన వేరుశనగ విత్తనాల్లో కేవలం 10 శాతమే సరఫరా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement