కేవీపల్లె : పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద, పెద్దతాండా, బసన్నగారిపల్లె ప్రాంతాల్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఏనుగులు గుంపు రాత్రి సమయంలో మామిడి తోటల్లోకి ప్రవేశించి మామిడి చెట్లు, కొబ్బరి, పనస చెట్లను ధ్వంసం చేశాయి. అలాగే మామిడి తోటకు చుట్టూ ఏర్పాటు చేసిన ముళ్ల (రాతి) కూసాలు, కంచెను తొక్కి నాశనం చేశాయి. డ్రిప్ పైపులుసైతం తొక్కి నష్టం కల్గించాయి. ఆదివారం ఉదయం మామిడి తోటల్లో ఏనుగులు సంచరించి చెట్లను ధ్వంసం చేసినట్లు బాధిత రైతులు గుర్తించి ఫారెస్ట్, రెవెన్యూ, ఉద్యాన శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జయప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు ఫారెస్ట్ బీటు అధికారి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో సిబ్బంది మామిడి తోటలను పరిశీలించారు. జిల్లేమంద నుంచి ఉస్తికాయలపెంట వైపు వెళ్లి ఎనుబోతుల వంక, ఎర్రమడుగు ప్రాంతం గుండా శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగులు వెళ్లినట్లు ఎఫ్‌బీవో తెలిపారు. ఉద్యానశాఖ, రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనా వేసి అటవీశాఖకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సుకుమార్‌రెడ్డి, రెవెన్యూ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


