మదనపల్లె పట్టణంలో అద్దె కార్లు నడుపుకుంటూ జీవించే డ్రైవర్ల సంఖ్య చాలా ఎక్కువ. అయితే, వీరికి పట్టణంలో ప్రత్యేకంగా ఎలాంటి టాక్సీ స్టాండ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో అక్రమార్కులు ఏకంగా బుగ్గ కాలువనే టాక్సీ స్టాండ్‌గా మార్చేశారు. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ప్రవహించే కాలువలో ఎగువ నుంచి వచ్చే నీరు ఒకవైపుకే వెళ్లేలా కృత్రిమంగా మట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. కాలువలో ఒక పక్కన సన్నటి నీటి ప్రవాహాన్ని ఉంచి, మిగిలిన సువిశాల కాలువ స్థలంలో అడ్డగోలుగా టాక్సీలను నిలిపి ఉంచుతున్నారు. డ్రైవర్ల సమస్యను గుర్తించి అధికారులు వీరికి వేరే చోట ప్రత్యేకంగా టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ ఊసే ఎత్తడం లేదు.


