సేవ్‌ స్పారో 

Tomorrow is sparrow day - Sakshi

కృత్రిమ ఆవాసాలతో పిచ్చుకల్ని కాపాడుతున్న పక్షి ప్రేమికులు 

మార్కెట్‌లోనూ లభ్యమవుతున్న స్పారో హౌస్‌లు

రేపు పిచ్చుకల దినోత్సవం

గాందీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): పిచ్చుక గూడు నిర్మాణమే ఓ అద్భుతం. ప్రకృతి తీర్చిదిద్దిన గొప్ప ఇంజనీర్లుగా పిచ్చుకలు పేరొందాయి. రేడియేషన్, వాతావరణ పరిస్థితులలో మార్పుల కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. పట్టణాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న తరుణంలో చెట్లు లేక పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాయి. పల్లెల్లో చెట్లు ఉన్నా.. అరకొరగానే పిచ్చుక గూళ్లు కనిపిస్తున్నాయి. 

కాపాడుతున్న పక్షి ప్రేమికులు 
గతంలో పట్టణాలలో పూరిళ్లు, పెంకుటిళ్లలో గూళ్లు ఏర్పాటు చేసుకుని పిచ్చుకలు సంతానాన్ని వృద్ధి చేసుకునేవి. నగరీకరణ నేపథ్యంలో ఇపుడా పరిస్థితి కనిపించడం లేదు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలు సాగు చేస్తుండటంతో పిచ్చుకలు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. సంతానోత్పత్తి మాట అలా ఉంచి ప్రాణాలు కాపాడుకోవడానికే ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర వాసుల్లో పక్షుల పట్ల ప్రేమ పెరుగుతోంది.

ముఖ్యంగా పిచ్చుకల కిచకిచలు వినాలని.. వాటికి ఆవాసాలు ఏర్పాటు చేయాలన్న స్పృహ చాలా మందిలో పెరిగింది. ఈ నేపథ్యంలోనే చెక్కతో చేసిన స్పారో హౌస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్స్‌లోని బాల్కనీలు, ఇళ్ల ముంగిట వీటిని అమరుస్తున్నారు. పిచ్చుకలకు కావాల్సిన ఆహారాన్ని, నీటిని సమకూరుస్తున్నారు. బియ్యం నూక, జొన్నలు, సజ్జలు వివిధ రకాల ధాన్యపు గింజలు వాటి కోసం పెడుతున్నారు. పక్షి ప్రేమికుల కోసం గడ్డితో తయారు చేసిన పిచ్చుక గూళ్లు సైతం కొన్ని మాల్స్‌లో విక్రయిస్తున్నారు. 

‘స్ఫూర్తి’ నింపుతున్నారు 
పిచ్చుకలను రక్షించే లక్ష్యంతో విజయవాడకు చెందిన స్ఫూర్తి క్రియేటివ్‌ ఆర్ట్‌ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పిల్లలకు పిచ్చుకల రక్షణపై అవగాహన కలి్పంచడం, వాటికి ఆవాసాలు ఏర్పాటుపై ఆసక్తి కల్పిస్తున్నారు. పిచ్చుకలను రక్షించుకోవడం ఎలా అనే అంశంపై వర్క్‌షాపులు, చిత్ర ప్రదర్శనలు సైతం నిర్వహిస్తోంది. అంతటితో సరిపెట్టకుండా చెక్కతో చేసిన కృత్రిమ ఆవాసాలను సైతం చిన్నారులకు అందిస్తోంది. కొందరు వ్యక్తులు పిచ్చుకలపై ప్రేమతో తమ ఇంటి పరిసరాల్లో వాటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్లాస్టిక్‌ గిన్నెల్లో నీళ్లు నింపి, గింజలు పెడుతున్నారు. మార్కెట్‌లో లభించే స్పారో హౌస్‌లను తమ ఇళ్ల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరుకు చెందిన తోట శ్రీనివాసరావు తన ఇంటి పెరట్లోని చిన్న చెట్లకు 10కి పైగా స్పారో హౌస్‌లు ఏర్పాటు చేశారు. వాటిలో చేరే పిచ్చుకలకు నీళ్లు, ఆహారం అందిస్తున్నారు. వేసవి కాలం పిచ్చుక సంతానోత్పత్తి సమయమని.. ఈ కాలంలో వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపితే మంచిదని ఆయన సూచిస్తున్నారు.

పిచ్చుకలను కాపాడుకోవాలి 
పంటలకు హాని చేసే క్రిములను తినడం ద్వారా పిచ్చుకలు రైతులకు సహాయకారిగా ఉండేవి. చిన్న జీవి అయినా పిచ్చుక­తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం చాలా ఉంది.

మా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ తమవంతుగా పిచ్చుకలకు కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. 
– శ్రీనివాస్, వ్యవస్థాపకులు,  స్ఫూర్తి క్రియేటివ్‌ ఆర్ట్, విజయవాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top