తిరుపతి విషాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న మోహన్.. భార్య, తల్లిని చంపి, ఆపై ఇద్దరు బిడ్డలతో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. అయితే అసలు విషయం అది కాదని బంధువులు, స్థానికులు చెబుతున్నారు.
రైల్వే మెయిల్ సర్వీసులో ఉద్యోగం చేసుకుంటున్న పెద్దబ్బ, చంద్రకళ దంపతుల కుమార్తె రేఖ, కుమారుడు మోహన్ ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో వారసుడని మోహన్‌ను గారాబంగా పెంచారు. పెద్దబ్బ విధుల్లో ఉంటూ మృతి చెందాడు. నిరుద్యోగి అయిన మోహన్ తండ్రి ఉద్యోగంపై ఆశలు పెంచుకున్నాడు. కాగా నారాయణవనంలో క్లినిక్‌ను ప్రారంభించిన కోడూరుకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ కుమార్ అక్క కుమార్తె హరితను మోహన్ 15 ఏళ్ల కిందట ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
మొదటి నుంచి గారాబంగా పెరిగిన మోహన్ ఏ పనిపై శ్రద్ధ చూపక సోమరితనానికి అలవాటు పడ్డాడు. తండ్రి ఉద్యోగం వచ్చినా.. కొన్నాళ్లకే దానిని మానేశాడు. దీంతో భార్య హరిత టైలరింగ్ షాపును నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచింది. కష్టపడి హరిత టైలరింగ్ షాపుతో పాటు బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించి మరో ఐదుగురికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగింది. పనిపై శ్రద్ధ చూపని మోహన్ క్రమంగా స్మార్ట్ ఫోన్‌కు బానిసైపోయాడు.
కబళించిన ఆన్‌లైన్ గేమింగ్
స్మార్ట్ ఫోన్‌తో గడుపుతూ ఆన్‌లైన్ రమ్మీకి అలవాటయ్యాడు మోహన్. క్రమంగా గేమింగ్‌లో నష్టపోతూ ఆన్‌లైన్‌లో అప్పులు చేశాడు. అధిక వడ్డీలతో పెరిగిన అప్పును చెల్లించమని ఒత్తిడి పెరిగినట్టు తెలిసింది. అప్పులను తీర్చడానికి పుత్తూరులోని ఇంటి స్థలాలను, ఆస్తులతో పాటు భార్య, తల్లి, పిల్లల నగలను తనఖా పెట్టి చెల్లించినా అప్పులు తీరలేదని తెలిసింది. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై నిలదీసిన తల్లిని, భార్యను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మను, భార్యను కడతేర్చిన నేరంపై జైలుకు వెళితే పిల్లలు ఒంటరైపోతారని భావించిన మోహన్ రైలు కింద పడి బలవర్మణానికి గురై ఉంటాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మోహన్, హరితల ఫోన్‌ల లాక్‌ను తీసి పరిశీలిస్తే గాని పూర్తి సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
పిల్లలు ఇంటికి వెళ్లి ఉంటే..?
బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్కూల్ నుంచి పిల్లలను ఉన్నపళంగా ఇంటికి తీసుకు వచ్చిన తండ్రి మోహన్‌తో పాటు కౌశిక్, హిమనిలు ఇంటికి వెళ్లి ఉంటే బతికి ఉండేవారు. తల్లి చంద్రకళ, ఆ తర్వాత భార్య హరితను చంపిన మోహన్ బ్యాంకు నుంచి నగదును డ్రా చేసుకున్నాడు. నగదును పక్కింటి రాధకు ఇచ్చిన మోహన్ తర్వాత తీసుకుంటానని చెప్పి, పుత్తూరులోని స్కూల్‌కు వెళ్లి మేనమామ చావుకు వెళ్లాలని చెప్పి కౌశిక్, హిమనిను ఇంటికి తీసుకు వచ్చాడు. ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఇద్దరిని ఉండమని, స్కూల్ బ్యాగులను ఇంట్లో ఉంచడానికి వెళ్లాడు. తండ్రితో పాటు పిల్లలిద్దరూ ఇంటికి వెళ్లి.. తల్లి, నాన్నమ్మల మృతదేహాలను చూసి, అరుపులు వేసి ఉంటే మోహన్‌తో పాటు ఇద్దరూ బతికి ఉండే వారు. స్కూల్ వద్ద ఆడుకుంటున్న పిల్లలతో మాటలు కలవడం, తండ్రితో పాటు ఇంటికి వెళ్లకపోవడం పిల్లలకు శాపంగా మారింది. తండ్రితో కలిసి రైలు కింద పడి బలవర్మరణం పొందేవారు కారు.



