మంచంపై నిద్రిస్తున్న బాలికకు పాముకాటు.. | Snake Bites 13 year old girl In kakinada | Sakshi
Sakshi News home page

మంచంపై నిద్రిస్తున్న బాలికకు పాముకాటు..

Apr 11 2026 1:36 PM | Updated on Apr 11 2026 2:05 PM

Snake Bites 13 year old girl In kakinada

ఏలూరు జిల్లా: కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన పుట్టిన రోజును వేడుకగా చేసుకున్న ఆనందం మరువక ముందే ఆ చిన్నారిని పాము రూపంలో మృత్యువు కబళించింది. మంచంపై తల్లితో నిద్రిస్తున్న ఆ బాలిక పాముకాటుకు గురై మృతి చెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు కోనపాపపేట మత్స్యకార కుటుంబానికి చెందిన చప్పా దీపిక (13) తల్లి మల్లీశ్వరితో గురువారం జన్మదిన వేడుక జరిగింది. ఆ రాత్రి తన ఇంటిలో నిద్రిస్తోంది. 

అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2.30 సమయంలో ఏదో కుట్టినట్టు అనిపించి తల్లికి చెప్పింది. ఏ ఎలకో కరచి ఉంటుందని భావించి ఉదయం ఇంజెక్షన్‌ చేయిస్తామని నచ్చచెప్పి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇబ్బందిగా ఉందని మరోసారి తల్లిని లేపింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి సమీపంలోని బంధువులకు విషయం చెప్పి చికిత్స కోసం 108కి సమాచారం ఇచ్చారు. ఆ వాహనం వచ్చేలోపే బాలిక నోటి వెంట నురగ రావడంతో చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా చికిత్స నిమిత్తం ఆధార్‌ కార్డు కావలసివచ్చి దీపిక పడుకున్న మంచం పరుపుకింద వెతకగా ఆ పక్కనే తాచుపాము బుసకొడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై అంతలోనే తేరుకుని దానిని హతమార్చారు. దీపిక స్థానిక జెడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఎస్సై వెంకటేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement