రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలంటే ఎలా?

Shyam Diwan argument in AP High Court About Amaravati Farmers - Sakshi

రాజధాని ఏ వర్గానిదో కాదు.. అది అందరిదీ అవుతుంది 

స్వాతంత్య్ర సమరయోధులు ఈ దేశం తమదేనని చెప్పలేరు 

అలాగే రాజధాని కూడా తమదేనని రైతులు చెప్పజాలరు 

హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు 

రాజధాని రైతులను ఇతరులతో పోల్చడానికి వీల్లేదు 

మాస్టర్‌ ప్లాన్‌కు తిలోదకాలివ్వడానికే మూడు రాజధానులు 

హైకోర్టులో శ్యాం దివాన్‌ వాదన 

విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక హక్కులున్నాయని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ తెలిపారు. రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలని, వారిని ఇతరులతో పోల్చడానికి వీల్లేదని చెప్పారు. ఈ వాదనపై హైకోర్టు స్పందిస్తూ.. రాజధాని అన్నది ఏ వర్గానిదో కాదని, అది అందరిదీ అవుతుందని వ్యాఖ్యానించింది. అమరావతిని ప్రజల రాజధాని అని చెబుతున్నప్పుడు అది రాష్ట్ర ప్రజలందరిదీ అవుతుందే తప్ప కొద్దిమందిది ఎంత మాత్రం కాజాలదంది. కర్నూలు, విశాఖపట్నం కూడా అందరివీ అవుతాయని తెలిపింది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు తాము పోరాడాం కాబట్టి ఈ దేశం తమది అవుతుందని ఎలా చెప్పజాలరో, అలా రాజధానిని కూడా తమదని కొద్దిమంది చెప్పడానికి వీల్లేదని పేర్కొంది.

రాజధానిని మనది అని ఎందుకు భావించరని ప్రశ్నించింది. దివాన్‌ తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ రెండోరోజు మంగళవారం తన వాదనలను కొనసాగించారు. రాజధాని విషయంలో ఎన్నికల తరువాత ప్రభుత్వ తీరు మాత్రం మారిపోయిందన్నారు.  

రైతుల త్యాగాలకు ప్రభుత్వం విలువ లేకుండా చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తికావడానికి చట్టంలో నిర్దిష్ట కాలవ్యవధి ఉందన్నారు. అయితే ప్రభుత్వ చర్యల వల్ల ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితిలేదన్నారు. చట్ట ప్రకారం చేయాల్సిందేదీ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేసిందన్నారు. సీఆర్‌డీఏ చట్టంలో పేర్కొన్న మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేస్తామని అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) చట్టంలో ప్రస్తావించారని, అయితే ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొన్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు తిలోదకాలిచ్చేందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. అందులో భాగంగానే పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను తెచ్చారని దివాన్‌ పేర్కొన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణ బుధవారానికి వాయిదా పడింది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top