అన్నదాతల ముంగిటకే బ్యాంకు.. రూ.25వేల వరకు విత్‌డ్రా

RBKs will provide all support to farmers says Andhra Pradesh governement - Sakshi

అన్నదాతల ముంగిటకే బ్యాంకు కరస్పాండెంట్లు

వీరి నుంచి రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చ

నగదు జమతోపాటు కొత్త అకౌంట్లు తెరుచుకోవచ్చు

పంట రుణాలు, రుణాల రీషెడ్యూల్, వంటి సేవలూ అందుబాటులో

ఆర్‌బీకేలతో బ్యాంకు కరస్పాండెంట్‌ల మ్యాపింగ్‌

శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు

వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు

నగదు జమతోపాటు కొత్త అకౌంట్లు తెరుచుకోవచ్చు

పంట రుణాలు, రుణాల రీషెడ్యూల్, నగదు జమ, కొత్త అకౌంట్లు

సాక్షి, అమరావతి: అన్నదాతలకు రకరకాల సేవలందిస్తూ ఎంతో ఉపయోగకరంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో సేవకు శ్రీకారం చుడుతోంది. ఇక నుంచి బ్యాంకింగ్‌ సేవలను కూడా వీటి ద్వారా రైతుల ముంగిటకే తీసుకురానుంది. దీంతో ఇన్నాళ్లూ బ్యాంకులో నగదు తీసుకోవాలన్నా.. జమ చేయాలన్నా.. రుణం పొందాలన్నా.. రుణాలు రీషెడ్యూలు చేసుకోవాలన్నా అన్నదాతలుసుదూర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లేందుకు ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడీ కష్టాలకు తెరపడనున్నాయి. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్ల ద్వారా ఈ సేవలు అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనుంది.

సీఎం చొరవతోనే బ్యాంకులూ సై
గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్‌బీకేలున్నాయి. వీటిలో 234 అర్బన్‌ ప్రాంతంలోనూ..10,544 గ్రామీణ ప్రాంతంలో రైతులకు సేవ లందిస్తున్నాయి. సీజన్‌లో రుణాల మంజూరు, రీషెడ్యూల్‌లతో పాటు వివిధ రకాల సేవల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా రైతుల ముంగిటకే బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఆర్‌బీకేల్లో బ్యాంకింగ్‌ సేవలందించేందుకు బ్యాంకర్లు సైతం ముందుకొచ్చారు.

ఆర్‌బీకేకో బ్యాంకు కరస్పాండెంట్‌..
శాఖల్లేని ప్రాంతాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సుమారు 11,500 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను నియమించుకున్నాయి. వీరిలో 8,500 మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరు రోజూ నాలుగైదు గ్రామాలకు వెళ్లి అక్కడ అకౌంట్‌లు లేని వారితో ఖాతాలు తెరిపించడం, బ్యాంకు-ఆధార్‌ సీడింగ్, కేవైసీ అప్డేషన్, నగదు ఉపసంహరణ వంటి సేవలందిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఆర్‌బీకేల్లో వీరి ద్వారా రైతులకు పూర్తిస్థాయిలో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఆర్‌బీకేలతో బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లను మ్యాపింగ్‌ చేస్తున్నారు. 

కరస్పాండెంట్లు అందించే సేవలివే..
⇒ వీరి వద్ద ఉండే మొబైల్‌ స్వైపింగ్‌
⇒ మిషన్‌ ద్వారా గరిష్టంగా రూ.25వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. 
⇒ కొత్తగా అకౌంట్‌లు ఓపెన్‌ చేసుకోవచ్చు. 
⇒ ఖాతాల్లో నగదు జమ చేసుకోవచ్చు. 
⇒ ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసే సాగు ఉత్పాదకాలతో పాటు యాంత్రీకరణ, కూలీలకు నగదు బదిలీ చేసుకోవచ్చు. 
⇒ పంట రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
⇒ కొత్త రుణాల మంజూరు, రీషెడ్యూల్‌ చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

రైతులకు చేరువలో  బ్యాంకింగ్‌ సేవలు
సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో ఆర్‌బీకేల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు అందించేందుకు బ్యాంకర్లుముందుకొచ్చారు. డిపాజిట్లు, విత్‌డ్రాలతో పాటు ఇన్‌పుట్స్, పండించిన పంటల కొనుగోళ్లు వంటి వాటి విషయంలో నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు రైతులకు తోడ్పాటునందిస్తారు. సమీప భవిష్యత్‌లో పంట రుణాల మంజూరు, రీషెడ్యూల్‌ కూడా ఆర్‌బీకేల్లో అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-హెచ్‌. అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top