శత్రువుల పాలిట సింహస్వప్నం.. ‘విశాఖ’

Rajnath Singh Dedicates Ins Visakhapatnam Warship On 21st Nov - Sakshi

ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం.. ఓ యుద్ధనౌక

జాతికి అంకితం చేయనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ

Rajnath Singh Dedicates Ins Visakhapatnam Warship : సుందర నగరం.. సిటీ ఆఫ్‌ డెస్టినీగా ప్రపంచం చూపు తన వైపు తిప్పుకుంటున్న విశాఖకు విశిష్ట గుర్తింపు లభించింది. ప్రాజెక్టు 15–బీలో భాగంగా ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌక సిద్ధమైంది. దీన్ని ఈ నెల 21న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జాతికి అంకితం చేయనున్నారు. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. 

సాక్షి, విశాఖపట్నం: సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూర కేంద్రంగా.. తూర్పు తీరంలో వ్యూహాత్మక రక్షణ ప్రాంతంగా.. విశాఖపట్నం కీలకంగా మారింది. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌ని ఓడించి.. జాతి గర్వించదగ్గ గెలుపునందించిన విశాఖ పేరు వింటే.. తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. మరి సముద్ర రక్షణలో శత్రువులను సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకని విశాఖపట్నం పేరుతో పిలిచే రోజు సమీపించింది. భారత నౌకాదళం ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకని సిద్ధం చేసింది. ఈ నెల 21న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నా«థ్‌ సింగ్‌ చేతుల మీదుగా ముంబైలో జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం సేవలందించనుంది. 

ప్రాజెక్టు–15బీలో మొదటి యుద్ధ నౌక 
ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్‌–15బీ పేరుతో నాలుగు స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలు విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్‌ పేర్లు పెట్టాలని నిర్ణయించింది. తొలి షిప్‌ని విశాఖపట్నంపేరుతో తయారు చేశారు.

2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది.  2013 అక్టోబర్‌లో షిప్‌ తయారీ పనులను వై–12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌(ఎండీఎల్‌) ప్రారంభించింది. ఇది సముద్ర ఉపరితలంపైనే ఉంటుంది.. కానీ ఎక్కడి శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు.  

సముద్ర జలాల్లోకి సంధాయక్‌ 
సాగర గర్భాన్ని శోధిస్తూ భారత భూభాగాన్ని పరిరక్షిస్తూ.. తిరుగులేని శక్తిగా సేవలందించేందుకు మరో నౌక సన్నద్ధమవుతోంది. 1981 నుంచి దేశ రక్షణలో ముఖ్య భూమిక పోషిస్తూ అనేక కీలక ఆపరేషన్లలో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని.. ఈ ఏడాది జూన్‌లో సేవల నుంచి ఐఎన్‌ఎస్‌ సంధాయక్‌ నిష్క్రమించింది. దాని స్థానంలో హైడ్రోగ్రాఫిక్‌ సర్వే షిప్‌(లార్జ్‌) సంధాయక్‌ని నిర్మిస్తున్నారు. ఈ నౌక నిర్మాణానికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖకు, కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌(జీఆర్‌ఎస్‌ఈ) మధ్య ఒప్పందం జరిగింది. హల్‌ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్‌లో తొలిసారిగా సముద్ర జలాల్లోకి రానుంది.

అనంతరం.. బేస్‌ ట్రయల్స్, సీ ట్రయల్స్‌ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న సంధాయక్‌ షిప్‌ల కంటే.. ఇది అతి పెద్ద సర్వే నౌకగా అవతరించబోతోంది. సముద్రలోతుల్ని, కాలుష్యాన్ని సర్వే చేయడంలో సంధాయక్‌ ప్రపంచంలోనే మేటి షిప్‌గా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతోంది. ఇందులో కొత్త సాంకేతికతతో కూడిన హైడ్రోగ్రాఫిక్‌ పరికరాలు అమర్చారు. హిందూ మహా సముద్రంలోని భౌగోళిక డేటాని సేకరించేందుకు తొలిసారిగా దీన్ని వినియోగించనున్నారు. 

నౌకాదళానికి కొత్తబలం 
హిందూ మహా సముద్ర ప్రాంతంలో మారుతున్న పవర్‌ డైనమిక్స్‌కి అనుగుణంగా విధులు నిర్వర్తించేలా ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం సత్తా చాటనుంది. ఈ యుద్ధ నౌక తూర్పు నౌకాదళ బలాన్ని మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా డిజిటల్‌ సర్వే కచ్చితత్వ ప్రమాణాల్ని పసిగట్టేవిధంగా సంధాయక్‌ కూడా త్వరలోనే కమిషనింగ్‌కు సిద్ధమవుతోంది. డిజిటల్‌ సర్వే అండ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్, ఆటోమేటెడ్‌ డేటా లాగిన్‌ సిస్టమ్, ఓషినోగ్రాఫిక్‌ సెన్సార్లు, సీ గ్రావి మీటర్, సైడ్‌ స్కాన్‌ సోనార్లు, మల్టీబీమ్‌ స్వాత్‌ ఎకో సౌండింగ్‌ సిస్టమ్‌లతో గతంలో ఉన్న సర్వే నౌకలకు భిన్నంగా ఇది రూపుదిద్దుకుంటోంది.
– వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహద్దూర్‌ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top