డేటా సెంటర్ శంకుస్థాపన పూర్తయ్యే
వరకూ పోలీసుల గుప్పిట్లోనే తర్లువాడ
పరిహారం ఇవ్వకుండానే భూములు లాగేసుకున్న ప్రభుత్వం.. నిరసన జ్వాల రగలకుండా
గెడ్డల్లోనూ, తోటల్లోనూ పోలీసుల పహారా
సాక్షి, విశాఖపట్నం: ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాగేసుకుని.. పైసా పరిహారం కూడా చెల్లించకుండానే భూములిచ్చిన ఊరిని పూర్తిగా బంధించి అదానీ గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. తర్లువాడలో నిరసన జ్వాలలు రగలకుండా నలువైపులా పోలీసుల్ని కాపలా పెట్టి.. అట్టహాసంగా చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఆంక్షల నడుమ నిర్వహించింది. తొలుత 30 వేల మంది స్థానిక ప్రజలతో భారీ బహిరంగ సభ నడుమ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించింది.
ఆనందపురం మండలం తర్లువాడ గ్రామానికి నలువైపులా పోలీసులను మోహరించి.. ఆ ప్రాంతాన్ని యుద్ధ ప్రాతిపదికన దిగ్బంధించారు. గెడ్డలు, వాగులు, వంకలు, చివరకు పొలాల్లోని మామిడి తోటలను కూడా వదలకుండా పోలీసులు పహారా కాశారు. తమ భూముల్ని బలవంతంగా లాక్కున్నారనే పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను కనీసం ఊరి పొలిమేరలు కూడా దాటకుండా నిర్బంధించడం చంద్రబాబు నిరంకుశ పాలనకు పరాకాష్టగా మారింది. ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ కార్యక్రమం వద్ద రైతులు నిలదీయాలని భావించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో రెండు రోజుల నుంచి తర్లువాడ గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. భూములిచ్చిన వందలాది మంది రైతులను దరిచేరనివ్వలేదు.
శంకుస్థాపన కార్యక్రమం ముగిసే వరకు గ్రామం నుంచి ఎవరూ బయటకు రాకుండా.. బయటి వ్యక్తులు ఊరిలోకి వెళ్లకుండా అప్రకటిత నిర్బంధాన్ని విధించారు. పొలం పనులకు, తోటపనులకు వెళ్తామని వచ్చిన రైతుల్ని కూడా వెనక్కి పంపించేశారు. తర్లువాడ నుంచి కేవలం ఇద్దరు టీడీపీ నేతలకు మాత్రమే సభకు హాజరయ్యేందుకు పాస్‌లు ఇచ్చారు. ఏయూ విద్యార్థులు, ఐటీ సెజ్‌లోని కంపెనీల ఉద్యోగుల్ని సభకు తరలించారు. ప్రభుత్వ దమనకాండతో భీతిల్లిన రైతులు, గ్రామస్తులు నష్టపరిహారం చెల్లించే వరకూ గూగుల్ డేటా సెంటర్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.


