కోరి తెచ్చుకుంటే.. కాలేజీని కాజేస్తోంది! | NRI medical college directors worry with Chandrababu coalition govt | Sakshi
Sakshi News home page

కోరి తెచ్చుకుంటే.. కాలేజీని కాజేస్తోంది!

Apr 27 2026 5:30 AM | Updated on Apr 27 2026 5:30 AM

NRI medical college directors worry with Chandrababu coalition govt

కూటమి సర్కార్‌పై ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ డైరెక్టర్ల ఆవేదన

అత్యంత విలువైన కాలేజీని సొంతం చేసుకోవడానికి ‘ముఖ్య’నేత పన్నాగాలు

తన బినామీలతో తీవ్ర ఒత్తిళ్లు

ముఖ్యనేత తరఫున బెదిరిస్తున్న ఓ మంత్రి

ఈ నెల 29న కొత్త డైరెక్టర్ల ఎన్నికకు కీలక సమావేశం

సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ ఇది తమ పార్టీ, తమ ప్రభుత్వమని భావిస్తే తమనే మింగేయాలని చూ­స్తో­ందని ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ పాత డైరెక్టర్లు లబోదిబోమంటున్నారు! కాలేజీని సొంతం చేసు­కో­వడానికి ‘ముఖ్య’నేత మనుషులు తెస్తున్న ఒత్తిడి­తో బెంబేలెత్తిపోతున్నారు. రాజధా­నికి చేరు­వలో మంగళగిరిలో రూ.2 వేల కోట్లకుపైగా విలు­వైన ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రిని చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత చేస్తున్న యత్నాలను ‘సాక్షి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. డైరెక్ట­ర్లను లొంగదీసుకునేందుకు ముఖ్య­­నేత సామదాన దండోపాయాలు ప్రయో­గిస్తున్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రి ఇదే పనిలో నిమగ్నమై డైరెక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తు­న్నట్లు సమాచారం. ముఖ్యనేతకు బినామీగా ఉన్న పారిశ్రామికవేత్త తెరవెనుక చక్రం తిప్పుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. 

నయాన భయాన లొంగదీసుకునే యత్నాలు..
ఎన్‌ఆర్‌ఐ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో అసలైన డైరెక్లర్లు ఎవరో తేల్చుకోవాలని ఆర్బిట్రేషన్‌ జడ్జి తీర్పు ఇవ్వడంతో ఇటీవల మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన వ్యక్తులు (పాత డైరెక్టర్లు, కాలేజీ వ్యవహారాల్లో ముఖ్యులు) సమావేశమయ్యారు. కొత్త డైరెక్టర్లను ఎన్నుకునేందుకు ఆ సమావేశంలో నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. దీనిప్రకారం వారంతా తమ అభిప్రాయాలను తెలిపి తిరిగి కొత్త మేనేజింగ్‌ కమిటీని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఈ నెల 29వతేదీన మరో సమావేశం నిర్వహించనున్నారు. అందులో కొత్త డైరెక్టర్లు, కొత్త మేనేజింగ్‌ కమిటీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌ నెలాఖరులోపు కొత్త కమిటీని నియమించుకోవాలని ఆర్బిట్రేషన్‌ జడ్జి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 29న జరిగే సమావేశం కీలకంగా మారింది. డైరెక్టర్లను నయాన భయాన లొంగదీసుకునేందుకు ముఖ్యనేత తరఫున ఓ మంత్రి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

వారి వ్యాపారాలు, ఇతర వ్యవహారాల గురించి ఆరా తీస్తూ బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ముఖ్య నేత మాట కాదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు డైరెక్టర్ల ఇళ్లకు వెళ్లి వార్నింగ్‌లు ఇస్తున్నట్లు సమాచారం. మెడికల్‌ కాలేజీ ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆశించిన డైరెక్టర్లు తాజా పరిణామాలతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీని కొన్ని దశాబ్దాలుగా పెంచి పోషించామని, గత ఎన్నికల్లో గెలిపించేందుకు శాయశక్తులా పని చేశామని, కానీ ఇప్పుడు తమపై గురి పెట్టటాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాన్ని తాము వ్యతిరేకించినా కాలేజీ విషయంలో జోక్యం చేసుకోలేదని, తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి ఒత్తిళ్లు చేయలేదని గుర్తు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement