సత్వర న్యాయం కోసం నూతన కోర్టుల ఏర్పాటు | New Courts Inaugurated in Vijayawada | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయం కోసం నూతన కోర్టుల ఏర్పాటు

Apr 27 2026 4:52 AM | Updated on Apr 27 2026 4:52 AM

New Courts Inaugurated in Vijayawada

నూతన న్యాయస్థానాలను ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌

విజయవాడలో ఐదు కోర్టులను ప్రారంభించిన న్యాయమూర్తులు

విజయవాడ లీగల్‌: ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి కొత్తగా న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ చెప్పారు. విజయవాడలోని న్యాయస్థాన భవన సముదాయంలో ఏర్పాటు చేసిన ఐదు సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్జి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభా ప్రకారం మరిన్ని న్యాయస్థానాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడానికి, సత్వర న్యాయం అందించడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 93 కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. కృష్ణా జిల్లాలో కొత్తగా 10 కోర్టులు వస్తుండగా.. అందులో విజయవాడలో ఏర్పాటు చేసిన ఐదు కోర్టులు ఆదివారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించాయని పేర్కొన్నారు. కాగా, పలువురు కోర్టు కాంప్లెక్స్‌లోని పార్కింగ్, లిఫ్టు సమస్యలను న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లగా.. సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు, కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టల గోపి, రెండో అదనపు జిల్లా జడ్జి ఎ.సత్యానంద్, బెజవాడ కోర్టు కాంప్లెక్స్‌లోని న్యాయమూర్తులు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు చలసాని అజయ్‌కుమార్, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు విష్ణుభట్ల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వీజీ కిరణ్, ఉపాధ్యక్షుడు బండారుపల్లి లెనిన్, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement