హైకోర్టు జడ్జి వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందన

Minister Kodali Nani Counter To HC Judge Rakesh Kumar - Sakshi

సాక్షి, కృష్ణా : నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలినాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయయూర్తి రాకేష్‌ కుమార్‌ జడ్జిమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. పదవీ విరమణ చేసి వెళ్లిన న్యాయమూర్తి రాకేష్‌ కుమార్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి గూగుల్‌ సెర్చ్‌ చేస్తే ఏదో వస్తుందని అంటున్నారని, కానీ తను సెర్చ్‌ చేస్తే ఆయన కుటుంబ నేపథ్యం వస్తోందన్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు, అవతలి వైపు ఎంత బలవంతులు ఉన్నా ఢీ కొట్టే వ్యక్తిగా చూపిస్తుందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా గూగుల్‌లో కనపడుతుందన్నారు.

‘‘చూసే వాళ్ళు ఏది కావాలంటే అదే గూగుల్లో వస్తుంది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి గుగూల్ సెర్చ్ చేస్తే ఏదో వచ్చిందని ఆర్డర్ కాపీ‌లో పెట్టాడు. గూగుల్‌లో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పేరు నొక్కినా అదే వస్తుంది. అయితే తాము వెదికితే మాత్రం సీఎం జగన్‌ ఎవరి ముందు తలవంచరు. దేశ చరిత్రలో నలభై సంవత్సరాల చరిత్ర గల పార్టీలతో ఆయన ఢీకొట్టినట్లు మాకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏ మంచి పనిచేసినా అడ్డం పడాలనే దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఎంతమంది కలిసి అడ్డుపడ్డా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇచ్చిన ప్రతి హమీని అమలు చేస్తారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో ప్రజలను, దేవుడిని, దివంగత నేత రాజశేఖరరెడ్డిని నమ్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. దేవుడి ఆశీస్సులు తో పాటు మీ ఆశీస్సులతో  నిజాయితీగా, అవినీతి లేని పాలన‌ చేస్తున్నారు. దేవుడి ఆశీస్సులు, రాజశేఖరరెడ్డి ఆశీస్సులు ఎప్పుడూ సీఎంకు ఉంటాయి. మీ అందరి దీవెనలు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఉండాలి. రాష్ట్రంలోకి చాలామంది వస్తుంటారు, పోతుంటారు. వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘సీఎం వైఎస్‌ జగన్‌ మీ కోసమే ఉన్నారు. ఇచ్చిన ప్రతి వాగ్ధానం అమలు చేస్తారు’’ అని ప్రజలకు హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top