బీమా పరిహారం చెల్లింపుపై హైకోర్టు కీలక తీర్పు

Key judgment of High Court on payment of insurance compensation - Sakshi

పరిహారం పెంచే అధికారం హైకోర్టుకు ఉందన్న న్యాయమూర్తి

రూ.1.79 లక్షల బీమా పరిహారం రూ.5.89 లక్షలకు పెంపు

సాక్షి, అమరావతి: ప్రమాద బీమా పరిహారం పెంపు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుపై బాధిత కుటుంబం అప్పీల్‌ దాఖలు చేయకపోయినప్పటికీ, ఆ తీర్పుపై బీమా కంపెనీ దాఖలు చేసే అప్పీల్‌లో సైతం పరిహారం మొత్తాన్ని పెంచుతూ తీర్పు ఇచ్చే అధికారం తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇదే సమయంలో కోరిన మొత్తం కంటే ఎక్కువ పరిహారంగా నిర్ణయించే అధికారం కూడా తమకు ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది.

ఓ ప్రమాదంలో బాధితుని కుటుంబానికి రూ.1.79 లక్షల పరిహారం చెల్లించాలన్న ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సవరించింది. పరిహారం మొత్తాన్ని రూ.5.89 లక్షలకు పెంచింది. ఇందులో ఇప్పటికే చెల్లించిన రూ.1.79 లక్షలకు అదనంగా రూ.4.10 లక్షలను బాధిత కుటుంబానికి చెల్లించాలని బీమా కంపెనీతో పాటు, ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు వెలువరించారు. 

కేసు పూర్వాపరాలివీ
గుంటూరు జిల్లా అమరావతికి చెందిన లలూనాయక్‌ అనే వ్యక్తిని 2005లో ఆటో అతి వేగంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో లలూనాయక్‌ మరణించగా.. ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రూ.2 లక్షలను పరిహారంగా ఇప్పించాలని మృతుని కుటుంబ సభ్యులు ప్రమాద బీమా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.

విచారణ జరిపిన ట్రిబ్యునల్‌ బాధిత కుటుంబానికి రూ.1.79 లక్షలను పరిహారంగా చెల్లించాలని బీమా కంపెనీని, ఆటో డ్రైవర్‌ను ఆదేశిస్తూ 2007లో తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ గుంటూరు డివిజనల్‌ మేనేజర్‌ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయగా.. జస్టిస్‌ దుప్పల వెంకటరమణ విచారణ జరిపారు. బీమా కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రిబ్యునల్‌ ఇచ్చిన పరిహారాన్ని రద్దు చేయాలని కోరారు.

వాహనం నడిపే సమయంలో ఆటో డ్రైవర్‌కు సరైన లైసెన్స్‌ లేదన్నారు. మృతుడి భార్య తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ట్రిబ్యునల్‌ ఇచ్చిన పరిహారాన్ని పెంచాలని కోరారు. మృతుని ఆదాయాన్ని నెలకు రూ.1,200గా పరిగణిస్తూ ట్రిబ్యునల్‌ బీమా పరిహారాన్ని నిర్ణయించిందన్నారు. మృతుడి ఆదాయాన్ని నెలకు రూ.4,500గా తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ట్రిబ్యునల్‌ తీర్పుపై బాధిత కుటుంబం అప్పీల్‌ దాఖలు చేయకపోయినా పరిహారం మొత్తాన్ని పెంచవచ్చని స్పష్టం చేశారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ఆ కుటుంబానికి జరిగే నష్టాన్ని ట్రిబ్యునల్‌ సరైన కోణంలో పరిశీలించలేదని ఆక్షేపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్‌ నిర్ణయించిన రూ.1.79 లక్షల పరిహారాన్ని రూ.5.89 లక్షలకు పెంచుతున్నట్టు తీర్పులో పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top