సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నాయుడి తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్ష నేతల గళాన్ని నులిమేస్తోందని, ఈ ఏడాది ఆరంభంలో తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించారని, ఇప్పుడు అధికారిక వైఎస్సార్‌సీపీ ఫేస్‌బుక్ పేజీని భారత్‌లో అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
‘‘ఇది కేవలం వైఎస్సార్‌సీపీపై దాడి మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి. మేము వాస్తవాలను మాత్రమే బయటపెడతాం, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి పద్ధతులను బహిర్గతం చేస్తాం. ప్రజలను ప్రభావితం చేసే అంశాలను వెలుగులోకి తీసుకొస్తాం. నిజం మాట్లాడినందుకు ప్రతిపక్ష పార్టీ అధికారిక ఖాతాలను, తద్వారా ప్రతిపక్ష స్వరాలను అణచివేయడం ప్రమాదకర ధోరణికి నాంది. ఇది అత్యంత ప్రజాస్వామ్య విరుద్ధ చర్య.
అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించిన అధిక వ్యయాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేయడం, డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు, టీటీడీ నెయ్యి టెండర్లు, ప్రజా ప్రాధాన్య అంశాల్లో భారీ అవినీతికి సంబంధించిన తగిన ఆధారాలను వెలుగులోకి తీసుకువస్తున్నాం. ఇటువంటి వంటి విషయాల నుంచి.. విమర్శనాత్మక సమాచారాన్ని ప్రజలు చూడకుండా నిరోధించడం వరకు ఆందోళనకర ధోరణి కనిపిస్తోంది.
ఈ అన్యాయపూరిత చర్యలను ప్రతి చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ మార్గంలో సవాలు చేస్తాం. బెదిరింపులు, సెన్సార్ చర్యలు, సంస్థల దుర్వినియోగం వంటివి ప్రజల గళాన్ని అణచివేయలేవు. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా నిలబెట్టడంలో, వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనే మౌలిక హక్కును పరిరక్షించడంలో మా నిబద్ధత కొనసాగుతుంది. ప్రజాస్వామ్య ప్రయోజనాల దృష్ట్యా, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే క్రమంలో మా అధికారిక పేజీని వెంటనే పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే న్యాయపోరాటం చేస్తాం’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an… pic.twitter.com/rJHq8BZ2pm— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2026


