వలపు వల.. నలుగురికి ఊస్టింగ్‌ | Honeytrap Scam Exposed in Anantapur: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వలపు వల.. నలుగురికి ఊస్టింగ్‌

Apr 27 2026 3:29 AM | Updated on Apr 27 2026 8:32 AM

Honeytrap Scam Exposed in Anantapur: Andhra Pradesh

రాప్తాడు సీఐ శ్రీహర్షకు బహుమతి అందజేస్తున్న రంగమ్మ (ఫైల్‌)

‘సాక్షి’ వరుస కథనాలతో టీడీపీ గ్యాంగ్‌ హనీట్రాప్‌ బాగోతం బట్టబయలు 

దందాకు సహకరించిన సీఐ శ్రీహర్ష,హెడ్‌ కానిస్టేబుల్‌ గిరి, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, దేవ్లా నాయక్‌లు సర్వీసు నుంచి డిస్మిస్‌  

ఎస్‌ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు జయరామ్‌నాయక్,దేవేంద్ర సస్పెన్షన్‌  

అనంతపురం రూరల్‌ పీఎస్‌ సీఐ శేఖర్‌ కర్నూలు రేంజ్‌కు సరెండర్‌ 

ఇప్పటికే వీఆర్‌కు త్రీ టౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌  

నిందితుల్లో ఇప్పటిదాకా ఎనిమిది మందికి రిమాండ్‌  

ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని తీవ్ర ఉత్కంఠ

సాక్షి ప్రతినిధి, అనంతపురం/రాప్తాడు రూరల్‌ : అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ‘టీడీపీ గ్యాంగ్‌ హనీట్రాప్‌’ కేసు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డబ్బున్న వ్యాపారులు, ఉద్యోగులు, రిటైర్ట్‌ ఉద్యోగులను గుర్తించి.. అమ్మాయిలతో తీయటి మాటలు మాట్లాడించి.. ఒంటరిగా రప్పించి దుస్తులిప్పి ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేసిన వైనంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రధాన అనుచరురాలు రంగమ్మ, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ప్రధాన అనుచరుడు రాజేనాయుడు నేతృత్వంలోని ముఠా కొందరు పోలీసు అధికారులను లోబరుచుకుని సాగించిన ఈ యవ్వారాన్ని బట్టబయలు చేసింది.

బెదిరించి, పంచాయితీలు చేసి బాధితుల నుంచి రూ.కోట్ల రూపాయలు దండుకున్న ఈ వ్యవహారంలో పలువురు సీఐ స్థాయి అధికారులే ముఠా సభ్యులకు నిస్సిగ్గుగా సహకరించడం దిగ్భ్రాంతి పరిచింది. ఇంకో మాటలో చెప్పాలంటే పోలీసు శాఖ పరువు తీసింది. ఈ దందాకు సంబంధించి డీఐజీ, ఎస్పీలు తీవ్రంగా స్పందించి విచారణ జరిపించారు. సాక్షి కథనాలన్నీ నిజాలేనని తేలడంతో ఎట్టకేలకు పలువురు పోలీసులపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ గిరి, కానిస్టేబుల్‌ దుర్గాప్రసాద్, ఇటుకలపల్లి పీఎస్‌ కానిస్టేబుల్‌ దేవ్లానాయక్‌ను ఏకంగా సర్వీసు నుంచి (డిస్మిస్‌) తొలగించారు. ఎస్‌ఐ రాంబాబు, కానిస్టేబుళ్లు జయరామ్‌నాయక్, దేవేంద్రపై సస్సెన్షన్‌ వేటు వేశారు. అనంతపురం రూరల్‌ పీఎస్‌ సీఐ శేఖర్‌ను కర్నూలు రేంజ్‌కు సరెండర్‌ చేశారు. త్రీ టౌన్‌ సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ను ఇప్పటికే వీఆర్‌కు పంపారు.  

విచారణలో మరింత మంది పేర్లు! 
ఈ కేసులో తొలుత ఐదుగురు నిందితులు రంగమ్మ, రాజేనాయుడు, జయలక్ష్మీ , చంద్రకళ, అనంతకుమారిని రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. వీరిలో మల్లీశ్వరి, ఉమా, ఉదయ్‌భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి ఆదివారం జడ్జి ఎదుట హాజరు పరచగా రిమాండ్‌కు ఆదేశించారు. అయితే వీరిలో ఉదయ్‌భాస్కర్‌రెడ్డి తొలుత బాధితుడిగా ఉన్నాడు. ఆయన ఫిర్యాదు మేరకే పోలీసులు తొలుత ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఈ దందాలో ఉదయ్‌ భాస్కర్‌రెడ్డి పాత్ర కూడా ఉందని దర్యాప్తులో తేలింది.

మరో నిందితుడు రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్‌ నరేంద్రరెడ్డిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాకు సంబంధించి పోలీసుల విచారణలో మరింత మంది పేర్లు బయట పడినట్లు సమాచారం. అయితే వారందరిపై చర్యలు తీసుకుంటారా.. లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, రాప్తాడు సీఐ డ్రైవర్, హోంగార్డు శ్రీనివాసులును వీఆర్‌కు పంపించేశారు. ఈ దందాలో మరికొందరు సీఐలు, ఎస్‌ఐల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బాధితుల సంఖ్య వందల్లోనే ఉందని సమాచారం. ఇదిలా ఉండగా పై స్థాయిలో ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర ఒత్తిడి ఉండటంతో ఇంతటితో ఈ కేసును ముగిస్తారా.. లేక పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చి, పోలీసు శాఖ పరువు నిలుపుకుంటారా అని ప్రజల్లో చర్చ జరుగుతోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement