రాచబాటల్లో రయ్‌ రయ్‌!

Funds Sanctioned For 8.3 km Of Paved Road On Paderu Vaddadi Route - Sakshi

జిల్లాలో రోడ్ల ఆధునీకరణ, నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల నిర్మాణ పనులు దాదాపుగాపూర్తయ్యాయి. వర్షాలకు దెబ్బతిన్న రహదారుల గుర్తించిన  ప్రభుత్వం  రోడ్ల విస్తరణ, ఆధునీకరణ, అభివృద్ధికి అధికమొత్తంలో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో పనులు చేపట్టడంతో వందలాది గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడింది. పాడేరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో రహదారులు కొత్తశోభను సంతరించుకున్నాయి.  
పాడేరు/రంపచోడవరం: పాడేరు నియోజకవర్గంలో 9 పనులకు సంబంధించి రూ.21.36 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పాడేరు ఆర్‌అండ్‌బీ డివిజన్‌ పరిధిలోని పాడేరు–వడ్డాది మార్గంలో 8.3 కిలోమీటర్ల పక్కా రోడ్డు అభివృద్ధికి రూ.2.85 కోట్లతో పనులు పూర్తయ్యాయి.  

  • పాడేరు నుంచి చింతపల్లి రోడ్డు అభివృద్ధికి రూ.4.25 కోట్లు, నర్సీపట్నం నుంచి చింతపల్లి మీదుగా సీలేరు వరకు రోడ్డుకు రూ. 2.80 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. 
  • పాడేరు నుంచి చింతపల్లి వెళ్లే రోడ్డుకు రూ.2.58 కోట్లు, ఇదే రోడ్డులో 46 నుంచి 54 కిలోమీటరు వరకు రూ.2.75 కోట్లు, 60వ కిలోమీటరు నుంచి 64 కిలోమీటర్ల వరకు అభివృద్ధికి రూ.1.88 కోట్లు అందిస్తున్నారు. పాడేరు–చింతపల్లి రోడ్డుకు రూ.కోటి, పాడేరు–వడ్డాది రోడ్డు నుంచి కందమామిడి జంక్షన్‌ నుంచి బంగారుమెట్ట రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయి. పనులు ప్రారంభదశలో ఉన్నాయి.  
  • అరకు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణ పనులకు పనులకు రూ.5.35 కోట్లు మంజూరయ్యాయి. 
  • పాడేరు అర్‌ అండ్‌ బీ డివిజన్‌ పరిధిలోని హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో నాలుగు రోడ్ల పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.5.35 కోట్లు మంజూరు చేసింది. ఇందులో పాడేరు–అరకులోయ ఆర్‌ అండ్‌బీ రోడ్డు నుంచి బాకూరు పోయే రోడ్డులో 5/6 నుంచి 13/24 వరకు రూ.1.48 కోట్లు కేటాయించారు. ముంచంగిపుట్టు మండలంలోని సుజనకోట రోడ్డులో 5/6 నుంచి 6/4 రోడ్డుకు రూ.48 లక్షలు, పాడేరు–పెదబయలు, మంచంగిపుట్టు, జోలాపుట్ట రోడ్డులోని 7 నుంచి 12/8, 32, 34 కిలోమీటర్ల రోడ్డులో రోడ్డులో రోడ్డ అభివృద్ధి, ప్రత్యేక మరమ్మతులకు రూ.2.66 కోట్లు ప్రభుత్వం వెచ్చించింది. ఈ మేరకు పనులన్నీ పూర్తయ్యాయి. అలాగే పాడేరు, బంగారుమెట్ట, నుర్మతి రోడ్డులోని 50 నుంచి 52 కిలోమీటర్ల రోడ్డు ఉన్న బొండాపల్లి ప్రాంతంలో రోడ్డు అభివృద్ధికి రూ.73 లక్షలు మంజూరు చేసింది. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి.  
  • రంపచోడవరం డివిజన్‌లో ఏజెన్సీలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌శాఖ, రోడ్డు భవనాలు శాఖ ఇంజనీర్లు చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  
  • మారేడుమిల్లి నుంచి పుల్లంగి వరకు 30 కిలోమీటర్లు మేర రోడ్డు నిర్మాణ పనులను రోడ్లు భవనాలశాఖ రూ.12కోట్లతో పూర్తి చేసింది. దీనివల్ల మండలకేంద్రం నుంచి మారేడుమిల్లి వరకు రహదారి సౌకర్యం చేకూరింది. 40 గ్రామాల ప్రజల సమస్య పరిష్కారమైంది.  
  • ఆకుమామిడి కోట నుంచి గుర్తేడు వరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ పనులు చేపట్టింది.  గోకవరం నుంచి పోతవరం వరకు  17 కిలోమీటర్ల మేర రోడ్డును రూ. 12 కోట్ల వ్యయంతో రోడ్డు భవనాలు శాఖ పూర్తి చేసింది. 
  • కొత్తపల్లి నుంచి గోకవరం వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర రోడ్డును రూ. 20 కోట్లు వ్యయంతో ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్మించారు. గతంలో ఈ రోడ్డులో వర్షం పడితే ఎక్కడిక్కడ కొండవాగులు పొంగి రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉండేది.  
  • అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో కూడా అనేక ప్రధాన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు వెచ్చించింది. దీనిలో భాగంగా చేపట్టిన రంపచోడవరం మండలం పందిరిమామిడి నుంచి చవిటిదిబ్బల రోడ్డు నిర్మాణం చివరి దశకు చేరింది. దీనవల్ల రంపచోడవరం, మారేడుమిల్లి, వై. రామవరం మండలాలకు చెందిన సుమారు వంద గ్రామాల గిరిజనులు రంపచోడవరం చేరుకునేందుకు దగ్గర మార్గం ఏర్పడింది.  
  • నాబార్డు  ఏఐఐబీ సహకారంతో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో  రూ.78 కోట్ల వ్యయంతో 150 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా 50 రహదారుల నిర్మాణం చేపట్టగా వీటిలో 8 పనులు పూర్తి చేశారు. మరో 28 పనులు చివరి దశలో ఉన్నాయి. మరో పది రోడ్ల నిర్మాణం అటవీ అభ్యంతరాల కారణంగా ప్రారంభం కాలేదు.

జూన్‌ నెలాఖరుకు రోడ్లన్నీ పూర్తి 
ఇప్పటికే మరమ్మతుల పనులు పూర్తికావస్తున్నాయి. రోడ్ల ఆధునీకరణ నిర్మాణాలు, బీటీ రోడ్డులు, సీఆర్‌ఎఫ్‌ ఫండ్స్‌ రోడ్ల నిర్మాణ పనులు జూన్‌ నాటికి పూర్తి చేస్తాం. ఆదిశగా నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధాన లైన్ల రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. సగానికి పైగా రోడ్ల నిర్మాణపనులు దాదాపు పూర్తకావస్తున్నాయి. రోడ్ల నిర్మాణాలను నాడు–నేడు పద్ధతిలో చేపడుతున్నాం.        
 – కె.జాన్‌ సుధాకర్,ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌

(చదవండి: చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్‌..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top