‘ఢీ’జిల్‌.. రైతులకు తప్పని తిప్పలు | Farmers Facing Problems With Petrol and Diesel Shortage | Sakshi
Sakshi News home page

‘ఢీ’జిల్‌.. రైతులకు తప్పని తిప్పలు

Apr 28 2026 4:37 AM | Updated on Apr 28 2026 4:41 AM

Farmers Facing Problems With Petrol and Diesel Shortage

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవేలోని పెట్రోల్‌ బంకు వద్ద పొలాల్లో మోటార్లకు డీజిల్‌ కోసం బారులుతీరిన రైతులు

సాగుకు చక్ర‘బంధనం’.. రైతులకు తప్పని తిప్పలు

సాక్షి, అమరావతి:  చంద్రబాబు సర్కారు అసంబద్ధ విధానాల వల్ల మార్కెట్‌లో పంట ఉత్పత్తులకు ధర లేక గగ్గోలు పెడుతున్న రైతులను ఇప్పుడు ఇంధన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముమ్మరంగా సాగుతున్న ధాన్యం, మొక్కజొన్న మాసూళ్లతో పాటు కోతకొచ్చిన ఇతర పంటల పనులను డీజిల్‌ కొరత వేధిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఆక్సిజన్‌ సమస్యలు తలెత్తకుండా రొయ్యలు, చేపలను రక్షించుకునేందుకు డీజిల్‌ దొరక్క ఆక్వా రైతులూ పడరాని పాట్లుపడుతున్నారు. బంకుల్లో నాలుగు రోజులుగా నోస్టాక్‌ బోర్డులు కనిపిస్తుండడంతో కర్షకులు లబోదిబోమంటున్నారు.  

కోతల వేళ.. విలవిల.. 
రబీలో దాదాపు 68.92 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అందులో 23 లక్షల ఎకరాల్లో వరి, మరో 23 లక్షల ఎకరాల్లో అపరాలు సాగయ్యాయి.  12.50 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న, 2.50 లక్షల ఎకరాల్లో జొన్న, 3.50 లక్షల ఎకరాల్లో నూనెగింజలు సాగయ్యాయి. అపరాలు, నూనెగింజల పంటల కోతలు దాదాపు పూర్తయిపోయాయి.  జొన్న కోతలూ దాదాపు 80 శాతం పూర్తి కాగా, మొక్కజొన్న 70 శాతం పూర్తయ్యాయి. వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. గోదావరి, కృష్ణా డెల్టా పరిధిలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతుండగా, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మొక్కజొన్న కంకి వొలుపు పనులు జరుగుతున్నాయి. 

పల్నాడు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మిర్చి కోతలు, అపరాల (మినుము, పెసర) త్రషింగ్‌ పనులు తుది దశలో ఉన్నాయి. కోతల వేళ యంత్రాల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా వరిలో కోతలు, నూర్పుళ్లు, రవాణాకు డీజిల్‌ అవసరం చాలా ఎక్కువ. డీజిల్‌ కొరత కారణంగా అద్దెకు తెచ్చి న కోత యంత్రాలు పొలాల్లోకి దిగలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి వరి కోతలకు హార్వెస్టర్లకు ఎకరాకు 10 నుంచి 16 లీటర్ల డీజిల్‌ అవసరం. 

అంటే రోజుకు సగటున 10 ఎకరాల్లో కోతలు పూర్తి చేయాలన్నా.. ఒక్కో హార్వస్టర్‌కు 100 నుంచి 160 లీటర్ల డీజిల్‌ కావాలి. ఇక కోసిన ధాన్యాన్ని తరలించడానికి ట్రాక్టర్లకు 10 ఎకరాలకు సుమారు 40 నుంచి 50 లీటర్ల డీజిల్‌ అవసరం. మొక్కజొన్న, అపరాల సాగులో ఉపయోగించే త్రషర్లకు  30 నుంచి 40 లీటర్ల డీజిల్‌ అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న కొరత వల్ల బంకుల వద్ద 5 నుంచి 10 లీటర్లకు మించి ఇవ్వడం లేదు. 

ఆలస్యమైతే దిగుబడులపై తీవ్ర ప్రభావం 
కోతలు ఆలస్యమయ్యే కొద్ది ఆ ప్రభావం దిగుబడులపై పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం గింజలు నేలరాలి పోయి దిగుబడులు తగ్గిపోతాయని చెబుతున్నారు. రంగు మారడం, విరగడం జరుగుతుందని, అప్పుడు మద్దతు ధర మాట దేవుడెరుగు కనీసం పెట్టుబడి కూడా దక్కే అవకాశాలు ఉండవని కర్షకులు వాపోతున్నారు. అకాల వర్షాలు కురిస్తే ఇక పంటపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఆవేదన చెందుతున్నారు.   

కూపన్లకూ ముప్పుతిప్పలు  
రైతుల వినతి మేరకు డీజిల్‌ సరఫరాలో రైతులు, ఆక్వా రైతులకు అధిక ప్రాధాన్యమివ్వాలని, డిమాండ్‌ను బట్టి వారికి కూపన్ల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కూపన్ల కోసం రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. రాజకీయ సిఫార్సులు ఉంటేనే కూపన్లు ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం వలన కూపన్ల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అడ్వాన్స్‌లు తీసుకున్న కోత యంత్రాల నిర్వాహకులు సైతం డీజిల్‌ కొరత వల్ల చేతులెత్తేస్తున్నారు. 

పైగా కోతలకు ఎకరాకు రూ.2800 నుంచి రూ.3వేలు వసూలు చేసే యంత్ర నిర్వాహకులు ప్రస్తుతం రూ.3వేల నుంచి రూ.4వేల మధ్య డిమాండ్‌ చేçస్తుండడం రైతులకు భారంగా మారింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీకే రాయపురం బంకు వద్ద డీజిల్‌ కోసం రైతులు ఆందోళన చేశారు. బంకు సిబ్బందితో ఘర్షణకు దిగారు. దీంతో అధికారులు బంకులో డీజిల్‌ సరఫరా నిలిపివేసి వరి యంత్రాలకు ఒక్కోదానికి 70 లీటర్ల డీజిల్‌ కూపన్లు ఇస్తామని దండోరా వేయించారు. అయితే ట్రాక్టర్లకు కూపన్లు ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేశారు.

ఆక్వా రైతులకు ’ ప్రాణవాయువు’ సంక్షోభం 
ఆక్వా రైతులకు డీజిల్‌  కేవలం ఇంధనం కాదు.. అది చేపలు, రొయ్యల ప్రాణవాయువుకు ఆధారం. రాత్రి వేళల్లో ఏరియేటర్లు నిరంతరం పనిచేయాలి. విద్యుత్‌లో వోల్టేజ్‌ సమస్యలు ఉన్నప్పుడు డీజిల్‌ జనరేటర్లే దిక్కు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేళ ఏరియేటర్లు ఏమాత్రం ఆగినా ఒకటి రెండు గంటల్లోనే రొయ్యలన్నీ తేలిపోతాయి. మాస్‌ మోరా్టలిటీ (మూకుమ్మడి మరణాలు) దెబ్బకు రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు.

ప్రస్తుతం ఒక్కో చెరువుకు ఆక్వా రైతులు గరిష్టంగా రూ.10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రోజుకు 4వేల టన్నుల చేపలు కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రవాణా అవుతున్నాయి. డీజిల్‌ సంక్షోభంతో ఆక్సిజన్‌ అందక రొయ్యలు, చేపలు చనిపోతే ఆర్థికంగా చితికిపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాజకీయ జోక్యం లేకుండా రైతులు, ఆక్వా రైతులకు డిమాండ్‌ మేరకు డీజిల్‌ సరఫరా చేయాలని  రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement