మొట్టమొదటి వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో సిద్ధం
విశాఖలోని ఎన్‌ఎస్‌టీఎల్‌కు అందజేసిన బీడీఎల్
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక టార్పెడో
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణ రంగం ప్రత్యేకించి దేశ సముద్ర భద్రత మరింత పటిష్టవంతంగా మారింది. ఆత్మనిర్భర్ భారత్ (స్వయం సమృద్ధి) కార్యక్రమంలో భాగంగా దేశం అత్యాధునిక ‘వైర్–గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో’ (డబ్ల్యూజీహెచ్‌డబ్ల్యూటీ)ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సంస్థ.. విశాఖపట్నంలోని తన యూనిట్‌లో 95 శాతం స్వదేశీ సాంకేతికతతో ఈ టార్పెడోను అభివృద్ధి చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రయోగశాల నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబోరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్)కి శనివారం అధికారికంగా అందజేసింది. ఈ కార్యక్రమానికి డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్ ఆర్‌వీ హరప్రసాద్, బీడీఎల్ సీఎండీ కమొడోర్ మాధవరావు, ఎన్‌ఎస్‌టీఎల్ డైరెక్టర్ డా.అబ్రహం వర్గీస్‌తో పాటు నౌకాదళాధికారులు హాజరయ్యారు. ఈ అత్యాధునిక టార్పెడోతో భారత నౌకాదళ సామర్ధ్యం మరింత పటిష్టం కావడమే కాకుండా, రక్షణ రంగ స్వయం సమృద్ధి సాధన దిశలో భారత్ మరో కీలక మైలురాయిని అధిగమించినట్లయ్యింది.
100 శాతం లక్ష్యాన్ని ఛేదించగల సత్తా
సాధారణ టార్పెడోల కంటే ఈ ‘వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో’ భిన్నంగా పనిచేస్తుంది. ప్రయోగించిన తర్వాత కూడా సన్నని వైర్ ద్వారా సబ్‌మెరైన్ లేదా యుద్ధ నౌకతో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల శత్రువుల కదలికలకు అనుగుణంగా వీటి దిశను ఎప్పటికప్పుడు మార్చవచ్చు. లక్ష్యాన్ని 100 శాతం ఛేదించగల సత్తా దీని సొంతం. శత్రువుల జలాంతర్గాములు, ఉపరితలనౌకల టార్పెడోలను అలాగే జలాంతర్గాములను నాశనం చేయడానికి ఈ టార్పెడో దోహదపడుతుంది.
కొన్ని ముఖ్యాంశాలు..
⇒ ఎన్‌ఎస్‌టీఎల్ సమన్వయంతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ అత్యాధునిక ఆయుధాన్ని అభివృద్ధి చేసింది.
⇒ అటు శిక్షణలోనూ, ఇటు యుద్ధరంగంలోనూ రెండు రకాలుగా వినియోగించేలా దీనిని రూపొందించారు.
⇒ ఈ అధునాతన ఆయుధ వ్యవస్థ ద్వారా శత్రునౌకలను గుర్తించవచ్చు. లక్ష్యం తప్పకుండా దాడి చేయవచ్చు.
⇒ తాజా ఆవిష్కరణ వల్ల విదేశీ సాంకేతికతపై ఆధారపడటం తగ్గడమే కాకుండా.. నిర్వహణ వ్యయం కూడా గణనీయంగా తగ్గనుంది.
⇒ ఈ వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడోను ఎన్‌ఎస్‌టీఎల్ రూపొందించిన ‘వరుణాస్త్ర’ ప్రాజెక్టులో ఒక కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు. ఇందులో భాగంగానే వరుణాస్త్రతో దీనిని అనుసంధానించనున్నారు.
వైర్ గైడెడ్ హెవీ వెయిట్ టార్పెడో విశేషాలివీ..
బరువు: సుమారు 1,500 కిలోలు
పొడవు: 7 నుంచి 8 మీటర్లు
తయారీ ఖర్చు: యూనిట్ ధర సుమారు రూ.12 కోట్లు
వార్‌హెడ్: సుమారు 250 కిలోల పేలుడు పదార్థం
రేంజ్: సుమారు 40 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు
వేగం: నీటి అడుగున గంటకు 74 కి.మీ
లోతు: సముద్ర మట్టానికి సుమారు 400 మీటర్ల లోతు వరకు వెళ్లి దాడి చేయగలదు
గైడెన్స్ వ్యవస్థ : అత్యాధునిక హోమింగ్, ప్రొపల్షన్ వ్యవస్థలున్నాయి


