AP New Cabinet Ministers: అమాత్య యోగం.. అద్వితీయం.. కీలక నేతలకు కేబినెట్‌లో స్థానం

AP New Cabinet Ministers Kottu satyanarayana And Karumuri Profile - Sakshi

కారుమూరి, కొట్టుకు కేబినెట్‌లో స్థానం 

ముదునూరికి చీఫ్‌ విప్‌ హోదా 

కొత్త పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరికి అవకాశం

కొవ్వూరులో వనితకు మళ్లీ చాన్స్‌

సాక్షి, ఏలూరు: సీనియార్టీకి సముచిత స్థానం, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జిల్లాలో కీలక నేతలకు మంత్రి పదవులు దక్కాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఇద్దరు నేతలకు తొలిసారి కేబినెట్‌లో చోటు దక్కగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తానేటి వనితకు మరలా అమాత్య యోగం దక్కింది. నరసాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముదునూరు ప్రసాదరాజుకు చీఫ్‌ విప్‌గా అవకాశం రాగా మొత్తంగా కేబినెట్‌లో జిల్లాకు కీలక ప్రాధాన్యం దక్కింది.  

అంకితభావానికి పెద్దపీట 
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు యధావిధిగా మూడు మంత్రి పదవులు దక్కాయి. గతంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాదిరిగానే ఇప్పుడూ ప్రాధాన్యమిచ్చారు. ఈసారి అదనంగా ప్రభుత్వ విప్‌ పదవిని కూడా అప్పగించారు. పార్టీపై విధేయత, పాల నపై అంకితభావం చూపిన వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమ ప్రాధాన్యమిస్తూ మంత్రివర్గంలో బెర్తులు ఖరారు చేశారు.

తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ యాదవ), తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనా రాయణ (కాపు), కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత (ఎస్సీ), న రసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు (క్షత్రి య)కు పదవియోగం దక్కింది. సామాజిక కూర్పు లు, పార్టీల విధేయత ఇలా పలు అంశాలను ప్రామా ణికంగా తీసుకుని మంత్రి పదవులకు ఎంపిక చేశారు. సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా వారికి ఆహ్వానాలు అందాయి.  

తొలిసారిగా కేబినెట్‌లోకి.. 
తాడేపల్లిగూడెం, తణుకు ఎమ్మెల్యేలు తొలిసారి కేబినెట్‌లో చోటుదక్కించుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా ప్రాంతాల్లో బాణసంచా కాల్పులు, మోటార్‌ సైకిల్‌ ర్యాలీలు జరిగాయి. తణుకులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం నిర్వహించారు. మరోవైపు ఉమ్మడి పశ్చిమగోదావరి చరిత్రలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజకు మా త్రమే కేబినెట్‌లో అవకాశం దక్కగా.. ఈసారి ఇందుకు భిన్నంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన కారుమూరికి అవకాశం కల్పించారు.

ఎమ్మెల్యేలు వనిత, కొట్టు, కారుమూరి, ముదునూరి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, పార్టీకి విధేయులుగా ఉంటూ పాలనలో తమ మార్కును చూపిస్తున్నారు. వీరిలో ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి చీఫ్‌ విప్‌ పదవి దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా నూతన పశ్చిమగోదావరిలో ఇద్దరికి అవకాశం రాగా ఏలూరు జిల్లాలో ఎవరికీ చాన్స్‌ దక్కలేదు.

సుదీర్ఘ రాజకీయ నేపథ్యానికి జై‘కొట్టు’
తాడేపల్లిగూడెం: సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, ని రంతరం ప్రజలను వె న్నంటి ఉండే గుణంతో బలమైన నాయకుడిగా ఎదిగారు ప్రభుత్వ హా మీల అమలు కమిటీ చై ర్మన్, ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. 1994 నుంచి సుమారు మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఆయన పలు సమస్యలపై పోరాడారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన సందర్భంలో పట్టణంలో అ భివృద్ధి ఎలా ఉంటుందో ల్యాండ్‌ మార్కులతో చేసి చూపించారు. 2004లో దివంగత వైఎస్సార్‌ సారథ్యంలో తొలిసారి తాడేపల్లిగూడెం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఐదేళ్ల పదవీ కాలంలో రూ.650 కోట్లతో అభివృద్ధి పనులు చేశారు.

పీసీసీ సభ్యునిగా, మెంబర్‌ ఆఫ్‌ ఎస్యూరెన్స్‌ కమిటీ ఏపీ లెజిస్లేటివ్, మెంబర్‌ ఆఫ్‌ హౌస్‌ కమిటీ ఇరిగ్యు లారిటీస్‌ ఆఫ్‌ మిల్క్‌డైరీస్‌ సభ్యునిగా పనిచేశారు. గత సాధారణ ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందు వైఎస్సార్‌ సీపీలో చేరిన ఆయన 2019లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజ యం సాధించారు. ప్రభుత్వ హామీల అమలు కమి టీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 1955 అక్టోబర్‌ 19న కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతి దంపతులకు ఆ యన జన్మించారు. భార్య సౌదామిని, ఇద్దరు కుమారులు బాలరాజేష్, విశాల్, కుమార్తె కంచన్‌ ఉన్నా రు. పుస్తకాలు చదవడం, బ్యాడ్మింటన్‌ ఆడటం ఆయన అలవాట్లు. నిత్యం యోగా చేస్తుంటారు.   

అందరివాడు.. కారుమూరి 
తణుకు అర్బన్‌ : తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. వి ద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయన వ్యాపార రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. దివంగత సీఎం వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ పార్టీలో 20 ఏళ్లపాటు సేవలందించారు.

2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్సార్‌ సారథ్యంలో 2009లో తణుకు ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత కాలంలో వైఎస్సార్‌ పార్టీలో చేరి 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మరలా 2019 ఎన్నికల్లో తణుకు నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో అమెరికన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ న్యూ అలుమ్‌నీ అసోసియేషన్‌ వెస్ట్‌ బ్రుక్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. వైఎస్సార్‌ విద్యుత్‌ ఎంప్లా యీస్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

మీ ఇంట్లో మంత్రిగా ఉంటా.. 
‘నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది దివంగత ము ఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అయితే మంత్రి పదవి ఇచ్చి నన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది సీఎం జగన్‌. బీసీ నేతగా నన్ను గుర్తించి మంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎప్పటిలాగే నియోజకవర్గంలో ప్రజానీకానికి అందుబాటులోనే ఉంటూ మీ ఇంట్లో మంత్రిగానే ఉంటాను’ అని ఆయన స్పష్టం చేశారు. 

విధేయతలో రా‘రాజు’ 
నరసాపురం: పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసి విధేయతలో రారాజుగా నిలిచారు నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు. దివంగత సీఎం వైఎస్సార్‌ స్ఫూర్తితో 2002లో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు సాగారు. యలమంచిలి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో నరసాపురం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప తేడాతో పరాజయం పొందారు.

ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం ఎమ్మెల్యే

అప్పటినుంచి 2009 వరకూ నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేసిన ఆయన పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేశారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారిగా గెలుపొందారు. వైఎస్సార్‌ అకాల మరణం అనంతరం జరిగిన పరిణామాలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచి 2012లో ఎమ్మె ల్యే పదవిని త్యాగం చేశారు. అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అతిస్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.

మరలా 2014లో ఆచంట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీచేసి అతిస్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిగా వ్యవహరించి నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేశారు. 2019 ఎన్నికల్లో  నరసాపురం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి అత్యధిక మెజర్టీతో గెలుపొందారు. 1974 మే 29న సత్యనారాయణరాజు, వెంకట సరోజినీదేవి దంపతులకు ఆయన జన్మించారు. ఆయనకు భార్య శారదావాణి, కుమారుడు శ్రీకృష్ణంరాజు, కుమార్తె సింధూజ ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top