జగనన్న గోరు ముద్ద.. అమలుపై ప్రత్యేక శ్రద్ధ

AP Govt Special attention on execution of Jagananna Goru Mudda  - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేలా నాలుగంచెల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం పాఠశాల సిబ్బంది మాత్రమే కాకుండా పాఠశాల తల్లుల కమిటీలు, వార్డు సచివాలయ కార్యదర్శులు, విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం దీనిని పర్యవేక్షిస్తున్నారు. కొత్తగా ఇందులో గ్రామ సమాఖ్యలను కూడా భాగస్వామ్యులను చేయనున్నారు. ఇందుకు సంబంధించి తాజా మార్గదర్శకాలను అధికారులు విడుదల చేశారు.

ప్రతిరోజూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తల్లుల కమిటీ సభ్యులు జగనన్న గోరుముద్దను పర్యవేక్షిస్తారు. వారానికి మూడుసార్లు వార్డు సచివాలయ విద్య అసిస్టెంట్‌ లేదా వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి పర్యవేక్షిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గ్రామ సమాఖ్యలు గోరుముద్ద కార్యక్రమం అమలుపై సమీక్షిస్తారు. మొత్తంగా పాఠశాల విద్యా శాఖ అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తారు.  పథకాన్ని మరింత రుచికరమైన, శుచికరమైన పౌష్టికాహారాన్ని అందించేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న గోరుముద్ద కార్యక్రమాన్ని అమలు చేయిస్తున్నారు. దీనికోసం ఏటా రూ.1,600 కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు. గతంలో రోజూ ఒకే రకమైన పదార్ధాలతో ఉండే మధ్యాహ్న భోజనాన్ని రోజుకో మెనూ ఉండేలా ముఖ్యమంత్రి తీర్చిదిద్దారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top