సీఎంతో చర్చిస్తామని మంత్రి హామీ
ఏప్రిల్ ముగుస్తున్నా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఎండలు మండుతాయి. వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన చిన్నారులు, బాలింతలు, గర్భిణుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎండల తీవ్రత దృష్ట్యా రెండునెలల రేషన్ ఒకేసారి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నా... అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవుల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. చర్చల సమయంలో సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం చెబుతామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఇచ్చిన హామీకి ఇంత వరకూ అతీగతీ లేదని అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో సెలవుల ప్రకటన
రెండు రోజుల్లో ఏప్రిల్ నెల ముగియనుంది. అయినా అంగన్‌వాడీలకు మే 1 నుంచి వేసవి సెలవుల ఇచ్చే విషయమై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అంగన్‌వాడీలకు మే 1 నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.
20 రోజుల క్రితమే చర్చించినా..
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని 20 రోజుల కిందటే అంగన్‌వాడీ యూనియన్ నేతలు కలిసి వేసవి సెలవుల విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా చాలా రోజులు సమయం ఉందని, సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి చెప్పారు. ఏప్రిల్ ముగిసి మే నెల వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంత వరకు సెలవుల విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే సెలవులు ప్రకటించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలితమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి వద్దే రేషన్(టీహెచ్‌ఆర్) అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు కోరుతున్నారు.


