3 Years Of YS Jagan Government: మూడేళ్లు.. ఎన్నో మేళ్లు

3 Years Of YS Jagan Government: Aimed At Welfare And Development - Sakshi

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి నేటికి మూడు సంవత్సరాలు

‘‘వైఎస్‌ జగన్‌ అనే నేను ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. 3,648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, పదేళ్లుగా మీలో ఒకడిగా నిలిచినందుకు ఆకాశమంత విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరుపేరును హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.’’
– 2019 ఏడాది మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
చెప్పిన మాటలివి. 

సాక్షి ప్రతినిధి కడప : అన్ని స్థాయిల్లో ప్రక్షాళన, విప్లవాత్మక మార్పులతో పాలన ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి  గడిచిన మూడేళ్లలో సరికొత్త సంక్షేమ, అభివృద్ధి పాలనను అందించి ప్రజల మన్ననలు అందుకున్నారు. సొంత జిల్లా వైఎస్సార్‌ జిల్లాలో సంక్షేమంతోపాటు వేల కోట్లు వెచ్చించి సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఆరోగ్య పథకాలు, అర్హులైన అందరికీ పెన్షన్లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌషకాహారంతోపాటు పలు పథకాలను అందించారు. అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే కొన్ని పథకాలు పూర్తి కాగా మరికొన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం. 

2019, అక్టోబరు 2న గాంధీ జయంతి నాడు ప్రభుత్వం చారిత్రాత్మకంగా సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 649 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ స్థాయికి పాలనను తీసుకొచ్చారు. వీటి పరిధిలో 6,490 మంది ఉద్యోగులను నియమించారు. ప్రజలకు పారదర్శకంగా, మెరుగైన సేవలు అందించేందుకు మరో 15 వేల మంది వలంటీర్లను నియమించారు.
  
అన్నదాతలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ప్రభు త్వం రైతు భరో సా కేంద్రాలు నెలకొల్పింది. తద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందివ్వడమే కాకుండా వారు పండించిన పంటలను కొనుగోలు చేస్తోంది. వారికి సలహాలు, సూచనలు ఇక్కడి నుంచే అందిస్తోంది. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తోంది. 

ఉమ్మడి జిల్లాలో రైతు భరోసా వివరాలు 
∙గడిచిన మూడేళ్లలో 60 వేల క్వింటాళ్లకు పైగా సబ్సి డీ వేరుశనగ, పిల్లిపెసర, జనుము తదితర విత్తనాలను అందించిన ప్రభుత్వం 3 లక్షల టన్నులకు పైగా రసాయనిక ఎరువులను రైతులకు అందజేసింది.  

సంక్షేమంతోపాటు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనుల పూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చింది. తెలుగుగంగ, కేసీ కెనాల్‌ పరిధిలోని కొరవ పనులను పూర్తి చేసి సాగునీటిని అందించింది. జీఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ. 1000 కోట్లకు పైగానే ఖర్చు చేసిన ప్రభుత్వం తాజాగా మరో రూ. 11 వేల కోట్లతో ఎర్రబల్లి లిఫ్ట్‌ స్కీమ్, గండికోట సీబీఆర్, గండికోట పైడిపాలెం లిఫ్ట్, పులివెందుల మైక్రో ఇరిగేషన్, జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్, అలవలపాడు లిఫ్ట్, జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌కెనాల్‌ విస్తరణ పనులను పూర్తి చేస్తోంది. దీంతోపాటు కుందూ, తెలుగుగంగ లిఫ్ట్‌ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రూ. 30 వేల కోట్లతో కొప్పర్తి పారిశ్రామికవాడ, గోపవరం, పులివెందుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు వద్ద ఉక్కు పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. పరిశ్రమల ఏర్పాటుతో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు, తద్వారా 5.20 లక్షలకు ఉపాధి లభిస్తోంది.  

పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు అన్ని ఆస్పత్రులను అభివృద్ధి చేసింది. పులివెందులలో రూ. 500 కోట్లతో మెడికల్‌ కళాశాల, కడప రిమ్స్‌లో రూ. 107 కోట్లతో కేన్సర్‌ ఆస్పత్రి, రూ. 125 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ బ్లాకు, రూ. 40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, పుష్పగిరి ఐ ఇన్సిట్యూట్‌లను నెలకొల్పారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకానికి మరిన్ని మెరుగులుదిద్ది 7,41,147 కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. 


 
గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతను ఇచ్చింది. రూ. 61.44 కోట్లతో రాష్ట్ర రహదారులను, రూ. 126.35 కోట్లతో జిల్లా ప్రధాన రహదారులను, రూ. 141 కోట్లతో పల్లె రహదారులను అభివృద్ధి చేశారు. ఇవి కాకుండా రూ. 1000 కోట్లతో బద్వేలు–మైదుకూరు జాతీయ రహదారి నిర్మాణం, రూ. 18 వేల కోట్లతో కోరుకొండ–అద్దంకి గ్రీన్‌ పీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, రూ. 3 వేలకోట్లతో కడప–రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌వే జాతీయ రహదారుల నిర్మాణ పనులను చేపట్టారు. 

గడిచిన మూడేళ్లలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చింది. విద్యా కానుక, ఇతరత్రా పథకాల ద్వారా విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top