రాష్ట్రంలో శంకర్‌దాదాలు! | 20 medical students caught cheating in university exams in vijayawada | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో శంకర్‌దాదాలు!

Apr 29 2026 5:00 AM | Updated on Apr 29 2026 5:00 AM

20 medical students caught cheating in university exams in vijayawada

వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ దొరికిన 20 మంది విద్యార్థులు 

చిట్టీలు, స్మార్ట్‌ ఫోన్లు, వాచీల ద్వారా కాపీయింగ్‌ 

స్మార్ట్‌ ఫోన్లు, వాచీలను ఎగ్జామ్‌ హాలులోకి ఎలా అనుమతించారు?  

అబ్జర్వర్, ఎగ్జామినర్, సిబ్బంది సహకారంతోనే కాపీయింగ్‌!

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమా తరహాలో వైద్య విద్య పరీక్షల్లో కాపీయింగ్‌ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ నెల 2 నుంచి రాష్ట్రంలో ప్రారంభమైన ఎంబీబీఎస్, పీజీ, డెంటల్, ఆయుష్‌ వార్షిక పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడుతూ ఇప్పటివరకు ఏకంగా 20 మంది వైద్య విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిలో 14 మంది అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. చిట్టీల ద్వారా కాపీయింగ్‌కు పాల్పడుతూ 16 మంది, స్మార్ట్‌ వాచీల్లో చూసి రాస్తూ ఇద్దరు, సెల్‌ఫోన్‌ ద్వారా కాపీయింగ్‌ కొడుతూ ఇద్దరు దొరికారు. విశాఖ, నెల్లూరు, కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలతోపాటు రాజమండ్రి, మంగళగిరి, విశాఖపట్నం, విజయనగరంలోని ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ పరీక్షల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడినట్టు సమాచారం.  

స్మార్ట్‌ వాచీలు, ఫోన్లు ఎలా అనుమతించారు? 
నిబంధనల ప్రకారం ఎగ్జామినేషన్‌ హాలులోకి స్మార్ట్‌ ఫోన్లు, వాచీలు తీసుకువెళ్లకూడదు. హాలులోకి ప్రవేశించేటప్పుడే ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంటారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉండే ఇని్వజిలేటర్లు, సిబ్బంది కూడా సెల్‌ఫోన్లు వినియోగించకూడదు. అయితే, తనిఖీలను దాటుకుని విద్యార్థులు చిట్టీలే కాకుండా, స్మార్ట్‌ ఫోన్లు, వాచీలతో పరీక్ష హాలులోకి ప్రవేశించి కాపీయింగ్‌కు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయా కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది, అబ్జర్వర్, ఎగ్జామినర్ల సహకారంతోనే కాపీయింగ్‌ తంతు నడుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రెండు ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్‌ వినియోగిస్తుండటంతో వారిని పరీక్షల విధుల నుంచి తప్పించారు. గతేడాది కూడా ఎంబీబీఎస్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ వైద్య విద్యార్థులు పట్టుబడ్డారు. కాగా, ప్రస్తుతం ఎగ్జామ్‌ సెంటర్లలో కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా గుర్తించినట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్మార్ట్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచీలు, చిట్టీల ద్వారా కాపీయింగ్‌కు పాల్పడుతూ విద్యార్థులు దొరికిపోయినట్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement