రూ. 3.61 కోట్లు హాంఫట్‌! | - | Sakshi
Sakshi News home page

రూ. 3.61 కోట్లు హాంఫట్‌!

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

‘ఉపాధి’ నిధులు మింగిన ఘనులు

రికవరీ వేటలో అధికారులు

అనంతపురం న్యూటౌన్‌: ఉపాధి హామీ పథకంలో దొంగలు పడ్డారు. అక్రమార్కులంతా ఒకటయ్యారు. కూలీల ఉపాధి ఊపిరి తీశారు. రూ. 3.61 కోట్ల మేర వివిధ రూపాల్లో అవకతవకలకు పాల్పడి కూలీల పొట్ట కొట్టారు. దుర్వినియోగమైన నిధుల రికవరీ వేటలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదీ స్థూలంగా జిల్లాలో ఉపాధి హామీ కింద గత ఏడాది జరిగిన గోల్‌మాల్‌ చిట్టా వివరాలు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉపాధి హామీ పనులు అక్రమార్కుల పాలిట వరంగా మారాయి. 31 మండలాల పరిధిలో గత ఏడాది సామాజిక తనిఖీ నిమిత్తం ఆయా మండల కేంద్రాల్లో గ్రామ సభలు నిర్వహించారు. కూలీలకు ఉపాధి కల్పించే పనుల్లోనూ, కార్యాలయ ఖర్చుల వివరాల నమోదు తదితర అంశాల్లో పారదర్శకత కల్పించడమే సామాజిక తనిఖీల ముఖ్యోద్దేశం. చేయని పనులకు బిల్లులు చెల్లించడం, మస్టర్‌లో బినామీ, తప్పుడు పేర్లు నమోదు చేయడం, పనికి రాకున్నా మరొకరి పేర్లతో కూలి వేతనాలు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి నిధుల వినియోగం లాంటి అనేక రూపాల్లో నిధుల దుర్వినియోగం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అదేవిధంగా చేసిన పనుల్లో కొలతలు తేడాలుండడాన్ని జిల్లా విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. కొన్ని మండలాల్లో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణా లోపాన్ని కనుగొన్నారు. మరి కొన్ని మండలాల్లో ఒకే పనికి రెండు దఫాలుగా బిల్లులకు చెల్లించినట్లు విశ్వసనీయ సమాచారం.

రికవరీ కోసం వేట

గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో జిల్లాలోని 31 మండలాల్లో రూ.3,61,80,678 నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితరులు అక్రమాలకు పాల్పడిన వారిలో ఉన్నారు. వీరి నుంచి రికవరీ కోసం విజిలెన్స్‌ అధికారులు గురువారం నుంచి వేట ప్రారంభించారు. పలు మండలాల్లో సదరు సిబ్బందిని పిలిపించి విచారణ చేసి.. రికవరీకి చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement