సమస్యలపై దృష్టి పెట్టండి | - | Sakshi
Sakshi News home page

సమస్యలపై దృష్టి పెట్టండి

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

అనంతపురం న్యూటౌన్‌: జిల్లా పరిషత్‌ పరిధిలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని జెడ్పీ సీఈఓ పి.విజయలక్ష్మి ఆదేశించారు. గురువారం జిల్లాపరిషత్‌ మీటింగ్‌ హాలులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన పరిపాలనాధికారుల(ఏఓ) సమావేశం నిర్వహించారు. సీఈఓ మాట్లాడుతూ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల కోర్టు కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఈ–ఆఫీసు వ్యవస్థ సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఏఓలదేనని స్పష్టం చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. అందుకు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులను కల్పించాల్సిన అవసరముందన్నారు. గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా విభజన సమాచారంతో ఎప్పుడు ఎన్నికలొచ్చినా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఏఓలకు సూచించారు. అనంతరం ఏఓలు.. జెడ్పీ సీఈఓను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

మంత్రి వచ్చాకే

వేరుశనగ పంపిణీ

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ సీజన్‌లో తొలకరి వర్షాలు పడుతున్నాయి. రైతులు సేద్యపు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే విత్తన వేరుశనగ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ జిల్లాకు వచ్చాకే విత్తన వేరుశనగ పంపిణీ మొదలు పెడతామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఆయన ఎప్పుడు తీరిక చేసుకుని వస్తారో.. విత్తనకాయలు ఎప్పుడు ఇస్తారో అని రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీఫ్‌లో అనంతపురం జిల్లాలో 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాలో 72 వేల క్వింటాళ్ల వేరుశనగ పంపిణీకి ప్రణాళిక రచించారు. ఇప్పటి వరకు 17,365 మంది రైతులు 15,285 క్వింటాళ్ల విత్తన వేరుశనగకాయల కోసం ఆర్‌ఎస్‌కేల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అయితే మండలాలకు 10 వేల క్వింటాళ్ల వరకు చేర్చినట్లు అధికారులు తెలిపారు.

బంగారు వ్యాపారి ఇంట్లో చోరీ

గుంతకల్లు: బంగారు వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని ఆలూరు రోడ్డు ద్వారక నగర్‌లో నివాసముంటున్న షమీవుల్లా ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో బంగారు షాపు నిర్వహిస్తున్నాడు. పిల్లలను విజయవాడలో స్కూల్‌లో చేర్చడానికి భార్య ఫర్హానతో కలిసి వారం రోజుల కిత్రం వెళ్లాడు. అక్కడ పిల్లలను స్కూల్‌లో చేర్పించిన తరువాత భార్య పుట్టినిల్లు అయిన బళ్లారికి పంపించి.. షమీవుల్లా విజయవాడలోనే ఉండిపోయాడు. ద్వారకానగర్‌లో షమీవుల్లా పై అంతస్తులో ఉంటూ కింద రెండు దుకాణాలను బాడుగుకు ఇచ్చాడు. ఒక షాపులో కరెంట్‌ లేకపోవడంతో అద్దెకున్నవారు ఓనర్‌ షమీవుల్లాకు ఫోన్‌లో తెలియజేశారు. దీంతో ఆయన తన భార్య ఫర్హానకు చెప్పడంతో గురువారం సాయంత్రం బళ్లారి నుంచి గుంతకల్లు వచ్చింది. ఇంటి వేసిన తాళం పగలుగొట్టి ఉండటం చూసి కంగుతుంది. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూస్తే బీరువాను తెరిచి.. బట్టలు మొత్తం చిందరవందరగా పడి ఉండటంతో భర్తకు ఫోన్‌ ద్వారా సమాచారమందించింది. 18 తులాల బంగారు ఆభరణాలు, రూ.3లక్షల నగదు కనిపించలేదని తెలిపింది. దీంతో షమీవుల్లా వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం చేరవేశారు.

ఆర్టీసీ బస్సు కీ అపహరణ

అరగంట పాటు ఆగిన బస్సు

గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో గురువారం ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు పుట్టపర్తి నుంచి మంత్రాలయం వెళ్లే ఆర్టీసీ బస్సు కీని అపహరించాడు. దీంతో బస్సు అరగంట పాటు ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. డ్రైవర్‌ బస్టాండ్‌లో బస్సును ఆపి టీ తాగడానికి వెళ్లాడు. తిరిగి వచ్చాక బస్సు తాళం చెవి కనిపించలేదు. కంగారు పడి అక్కడే డ్యూటీలో ఉన్న పోలీసులకు చెప్పాడు. పోలీసులు మైక్‌లో తాళాల విషయంపై అనౌన్స్‌ చేశారు. కీ తీసుకున్న వారు ఇచ్చేయాలని, లేకుంటే సీసీ కెమెరాలను పరిశీలించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో కీ తీసుకెళ్లిన ప్రయాణికుడు వాటిని పోలీసులకు అప్పగించాడు. ఆకతాయి చేష్టలు చేసినందుకు సదరు వ్యక్తికి పోలీసులు దేహశుద్ధి చేశారు. అరగంట తర్వాత బస్సు మంత్రాలయం బయలుదేరి వెళ్లింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement