ప్రభుత్వ పాఠశాలల్లో యజ్ఞంలా మొక్కల పెంపకం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో యజ్ఞంలా మొక్కల పెంపకం

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

● డ్వామా పీడీ నిర్మలా దేవి ● బేతపూడి కేజీబీవీ, తెనుగుపూడి గురుకుల పాఠశాలల సందర్శన

దేవరాపల్లి: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో యజ్ఞంలా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు డ్వామా పీడీ సీహెచ్‌. నిర్మలాదేవి తెలిపారు. బేతపూడి కేజీబీవీ, తెనుగుపూడి బి.ఆర్‌.అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటేందుకు తవ్విన గోతులను పరిశీలించి, ఉపాధి హామీ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నెట్‌ జీరో హెల్తీ క్యాంప్‌ కార్యక్రమంలో భాగంగా జూన్‌ 20 లోపు మొక్కల నాటే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. 4,500 పెద్ద చెట్లు, 5780 మధ్యస్త చెట్లు, 35,250 పొదల మొక్కలు, 30,500 ఔషధ మొక్కలు పాఠశాలల ఆవరణలో నాటనున్నట్టు ఆమె చెప్పారు. ఒక్కో పాఠశాలలో రూ. 4.99 లక్షల వ్యయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. మొక్కల సంరక్షణకు తొలి ఏడాది రూ. 4 లక్షలు, రెండు, మూడో ఏడాదిలో నీటి తడుపులు, నిర్వహణ కోసం రూ. 23వేలు చొప్పున నిధులు కేటాయిస్తామన్నారు. జలధార కార్యక్రమం ద్వారా జిల్లాలో 617 చెరువుల పరిధిలో 1,614 అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. వీటి కోసం రూ. 66.62 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో వై.రుక్మిణీదేవి, ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్‌ కె.శ్రీను, ఈసీ వెంకటేష్‌, ఎంపీడీవో కార్యాలయం పరిపాలన అధికారి లక్ష్మీనారాయణ, ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొ న్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement