స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖకు రానున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్ర గాయాలతో నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతో పాటు, ప్రస్తుతం సెవెన్‌హిల్స్, కిమ్స్ ఐకాన్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ జగన్ స్వయంగా పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..
ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 11:20కి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాంనగర్లో గల సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి 11:40కి చేరుకుని, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. తిరిగి మధ్యాహ్నం 1:10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1:50కి షీలానగర్‌లో ఉన్న కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 2:20 గంటలకు ఆసుపత్రి నుంచి బయలుదేరి 2:30కి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రయాణమవుతారు.


