రికవరీ సొత్తు విలువ రూ.1.65 కోట్లు
అనకాపల్లి: ప్రతి వ్యక్తికి నిత్యజీవితంలో మొబైల్ అనేది కేవలం ఒక వస్తువు కాదని, వారి జీవితకాల జ్ఞాపకాలు, వ్యక్తిగత సమాచారం అందులోనే ఉంటుందని, సెల్‌ఫోన్లు పోయినట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, 12వ విడతలో 808 సెల్‌ఫోన్లు రికవరీ చేయడం జరిగిందని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి రికవరీ చేసిన ఫోన్లను వాటి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన ఫోన్లు సుమారుగా రూ.1.65కోట్లు విలువ చేసే 808 పోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. జిల్లా చరిత్రలో పెద్ద మొత్తంలో మొదటి సారిగా పెద్ద సంఖ్యలో ఫోన్లు రికవరీ చేయడం జరిగిందన్నారు. ఈనెల 1వ తేదీ వరకూ 8,500 చోరీకి గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. 11 విడత వరకూ 4,086 మొబైల్ ఫోన్ల విలువ రూ.8.42 కోట్లు ఉంటుందన్నారు. ఈ ఏడాది 1543 సెల్‌ఫోన్లు మిస్సింగ్ అయినట్టు ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ చెప్పారు. జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్: 9346912007కు ‘ఏజీ‘ అని టైప్ చేసి పంపితే వచ్చే లింక్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.


