కశింకోట: పేరంటాలపాలెం గ్రామానికి చెందిన వృద్ధ ఉపాధి కూలీ మంగళవారం మృతి చెందారు. మండపాక సత్యారావు (67) ఉపాధి కార్యక్రమంలో పంచాయతీ పరిధిలో కూలీకి వెళ్లి ట్రెంచ్ తవ్వకం పని చేస్తుండగా ఉదయం 7.30 గంటల సమయంలో నీరసంగా ఉందని కిందికి పడిపోవడంతో స్థానికులు, ఉపాధి సిబ్బంది సహాయంతో అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించడంతో తిరిగి పేరంటాలపాలెం తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఏపీవో ఎం.శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. భార్య రమణమ్మ, పెళ్లయిన ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు.


