ఒకే దశాబ్దంలో మూడు విషాదాలు
విశాఖను ఒకే దశాబ్దంలో మూడు పెద్ద విషాదాలు వెంటాడాయి. ఎల్జీ పాలిమర్స్, హెచ్‌పీసీఎల్, ఇప్పుడు స్టీల్‌ప్లాంట్. ప్రతిసారీ ఒకే డ్రామా పునరావృతమవుతుంది. ప్రమాదం జరుగుతుంది, విచారణ కమిటీలు వేస్తారు, నివేదికలు వస్తాయి, కేసులు పెడతారు. కొన్ని నెలల తర్వాత అంతా మర్చిపోతారు. కానీ సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలు ఎలా మర్చిపోతాయి?
మూడేళ్లుగా పోరాడుతూనే నడిపిన ప్లాంట్
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పటి నుంచి కార్మికులు దాదాపు మూడేళ్లుగా పోరాడుతున్నారు. వేతన కోతలు, వీఆర్‌ఎస్ పేరుతో సిబ్బంది తగ్గింపు, ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నా..‘కన్నతల్లిలాంటి’ ఈ ప్లాంట్‌ను గుండెల్లో పెట్టుకుని నడిపించారు. అదే ప్లాంట్‌లో ఇప్పుడు అడుగుపెట్టాలంటే భయంగా ఉందని కార్మికులే చెప్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం తర్వాత మంగళవారం ప్లాంట్‌లో నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆవేదన గాలిలో తేలింది.
అతడికి ఆ రోజు మామూలే అనిపించింది.
టిఫిన్ తిన్నాడు. చొక్కా వేసుకున్నాడు. చేతిలో లంచ్‌బాక్స్ పట్టుకున్నాడు. గుమ్మం దాటుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు..భార్య అక్కడే నిలబడి సాగనంపింది. అది తన చివరి చూపు అవుతుందని అతనికి తెలియదు. లోపలున్న ఆమెకూ తెలియదు. ఆ సాయంత్రం తిరిగి రాని ఆ చూపు, ఇప్పుడు ఆ ఇంటిలో శాశ్వత నిశ్శబ్దమైపోయింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మెల్టింగ్ షాప్ అంటే సాధారణ పని స్థలం కాదు. అది 1,600 డిగ్రీల సెల్సియస్ వేడి రాజ్యం. రాయి కరిగి నీరయ్యే వేడి. ఉక్కు లావాలా ప్రవహించే వేడి. ఆ నిప్పుల కొలిమి పైన వేలాడుతున్న లాడెల్ క్రేన్ సోమవారం సాయంత్రం ఒక్కసారిగా తెగిపడింది. కరిగిన ఉక్కు వెల్లువలా ముంచెత్తింది. మిగతా కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తారు. కానీ ఆ ఎనిమిది మంది మాత్రం తప్పించుకోలేకపోయారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా ముద్దలైపోయాయి.
ఆ రాత్రి, ఆ ఎనిమిది ఇళ్లలో దీపాలు వెలిగాయి..కానీ వెలుతురు రాలేదు.
గుమ్మం వైపే చూస్తూ నిద్రపోయిన పిల్లలు
ఒక ఇంట్లో పిల్లలు అమ్మను అడిగారు..‘నాన్న ఎప్పుడొస్తారు?’
‘రాత్రికి వస్తారు’ అని ఆమె చెప్పింది. గుమ్మం వైపు చూస్తూ చూస్తూ వాళ్లు నిద్రపోయారు. తెల్లవారింది. నాన్న రాలేదు. ఆ పిల్లలకు ఇంకా అర్థం కాలేదు..నాన్న ఇక ఎప్పటికీ రారని.
మరో ఇంట్లో ముసలి తల్లి కొడుకు కోసం అన్నం వడ్డించి కూర్చుంది. అన్నం చల్లారిపోయింది. ఆమె ఆశలూ ఆవిరైపోయాయి.
వీళ్లేం సరిహద్దుల్లో తుపాకులు పట్టలేదు. ప్రాణాంతక వ్యాధితో పోరాడలేదు. కేవలం పొట్టకూటి కోసం పనికి వెళ్లారు. కానీ వారు నమ్ముకున్న పని స్థలం వారికి రక్షణ ఇవ్వలేకపోయింది.
అరిగిపోయిన క్రేన్లు. కాలం చెల్లిన సాంకేతికత. లాభాల కోసం ప్రాణాలను పణంగా పెట్టే నిర్ణయాలు. ఎందుకంటే ప్లాంట్ ఆపితే ప్రొడక్షన్ ఆగుతుంది, లాభాలు తగ్గుతాయి, పై అధికారులు ప్రశ్నిస్తారు. ఆ కార్పొరేట్ భయాల మధ్య ఎనిమిది మంది నిరపరాధుల ప్రాణాలు బూడిదయ్యాయి. –సాక్షి, విశాఖపట్నం
అంకెలుగా మిగిలిపోకూడదు
రేపు వీరి పేర్లు పేపర్లలో వస్తాయి. టీవీల్లో చర్చలు జరుగుతాయి. రెండు రోజుల తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో కేవలం అంకెలుగా మిగిలిపోతారు. న్యాయం అంటే కొన్ని లక్షల పరిహారం విసిరేయడం కాదు. వ్యవస్థ మారాలి. పరిశ్రమల్లో లాభాల కంటే కార్మికుల ప్రాణాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. పని కోసం ఇల్లు దాటిన ప్రతి మనిషి, క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడం వారి హక్కు. ఆ హక్కును కాపాడడం వ్యవస్థ బాధ్యత. రేపు మరో తల్లి కన్నీరు కార్చకుండా ఉండటమే.. వీరికి ఇచ్చే నిజమైన నివాళి.


