పచ్చని చెట్లూ పచ్చనేతల పాలు | - | Sakshi
Sakshi News home page

పచ్చని చెట్లూ పచ్చనేతల పాలు

Jun 10 2026 1:13 AM | Updated on Jun 10 2026 1:13 AM

ప్రభుత్వ భూమిలో అక్రమంగా చెట్ల నరికివేత

అర్ధరాత్రి వేళ విలువైన కలప తరలింపు

గతంలో చెట్ల నరికివేతతో కూటమిలో కుమ్ములాట

గ్రామంలో జరిగిన అల్లర్లతో తీవ్ర ఉద్రిక్తత

మళ్లీ దొంగచాటుగా చెట్లు నరికి తరలింపు

బుచ్చెయ్యపేట: మండలంలో గల పెదమదీన గ్రామంలో విలువైన అకేషియా చెట్లను ఆర్ధరాత్రి నరికి తరలించారు. గ్రామానికి ఆనుకుని విశాలంగా కొండ ప్రాంతం ఉంది. అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 150 ఎకరాల్లో ఏపుగా అకేషియా చెట్లు పెరిగి ఉన్నాయి. సోమవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు ట్రాక్టర్లు లోడు వరకు నరికి పట్టుకుపోయారు. ఇదే చెట్ల విషయంలో గతంలో గ్రామంలో కూటమి నేతలు గొడవలు పడ్డారు. ఈ ఏడాది జనవరిలో కూటమికి చెందిన సర్పంచ్‌ భర్త కె.వి.ఆర్‌ నాయుడు కొండ ప్రాంతంలో ఉన్న చెట్లను నరికి గ్రామ అభివృద్ధి పనులకు వినియోగిస్తామని పంచాయితీ తీర్మానం చేయించారు. అప్పట్లో సర్పంచ్‌ భర్త ప్రభుత్వ భూమిలో చెట్లు నరికిస్తుండగా ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్‌ వియ్యపు అప్పారావు వర్గీయులు అడ్డుకున్నారు. వేలం వేయకుండా ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లు నరకొద్దని తెలపగా దీనిపై ఇరు వర్గాలు వారు గొడవ పడ్డారు. జనవరి 20వ తేదీన గ్రామ రామాలయం వద్ద కూటమి నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కారాలు విసురుకుంటూ కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా పలువురు గాయపడ్డారు. డీఎస్పీ, సీఐ, పలు పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌ఐలు, పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. వారం రోజుల పాటు గ్రామంలో 144 సెక్షన్‌ అమలు చేశారు. ఈ గొడవల కారణంగా మనస్థాపానికి గురైన సర్పంచ్‌ భర్త కె.వి.ఆర్‌ నాయుడు అకాలంగా మృతి చెందారు. మరలా ఇదే భూమిలో చెట్లు నరికి వేయడంపై గ్రామంలో చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి పూట ప్రభుత్వ భూమిలో అకేషియా చెట్లు తరలించడంతో గ్రామంలో మరలా గొడవలు జరిగే అవకాశం ఉందని ఆందోళన నెలకొంది. గ్రామంలో ప్రభుత్వ భూమిలో విలువైన అకేషియా చెట్లు నరికివేత కూటమి నేతల పనేనని మండల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి కె.అచ్చింనాయుడు ఆరోపిస్తున్నారు. చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement