నెలరోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరా ● ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఆందోళన
నక్కపల్లి: మండలంలో పలు గ్రామాల్లో దాదాపు నెలరోజుల నుంచి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. వేసవి ఎండలు, ఆపై ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి గోరు చుట్టుపై రోకటిపోటులా తాగునీటి ఎద్దడి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఇబ్బందులను గుర్తించిన వైఎస్సార్‌సీపీ నాయకులు మంగళవారం ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ డిమాండ్ చేశారు. నక్కపల్లిలో నెలరోజుల నుంచి రక్షిత మంచినీటి పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరగడం లేదు.హెటెరో రసాయన పరిశ్రమ వారు ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్ దగ్గర నుంచి ఐదు రూపాయలకు డబ్బా నీళ్లు కొనుక్కుని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఈ ఆర్‌వో ప్లాంట్ కూడా వారం రోజుల నుంచి మూలకు చేరింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. తాగునీటి కోసం కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు.
ఉపమాకలో కుళాయిల మూగనోము
ప్రముఖ పుణ్యక్షేత్రం ఉపమాకలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలంతా ఆలయం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కుళాయిల వద్దకు వచ్చి నీటిని పట్టుకుంటున్నారు. ఉపమాక శివారు మన బాన వానిపాలెం గ్రామస్తులకు ఇదే ఇబ్బంది ఉంది. వీరు కిలోమీటరు దూరంలో ఉన్న జాతీయరహదారి వద్దకు వచ్చి అక్కడ ఉన్న వ్యవసాయ బావుల్లో నీటిని తాగడం, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవాల్సిన పరిస్దితి నెలకొంది. గొట్టివాడ వద్ద వరాహనదిలో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు సక్రమంగా పని చేయడం లేదు. అక్కడ నుంచి నక్కపల్లి పరిసర ప్రాంత గ్రామాలకు పైపుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల కిత్రం ఏర్పాటు చేసిన ఈ పైపులైను పూర్తిగా చెడిపోయింది. తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నప్పటికీ వారం పదిరోజుల మించి పనిచేయడం లేదు.


