స్టీల్‌ప్లాంట్‌ దుర్ఘటనతో ఎనిమిది కుటుంబాల్లో తీరని విషాదం | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ దుర్ఘటనతో ఎనిమిది కుటుంబాల్లో తీరని విషాదం

Jun 9 2026 4:54 AM | Updated on Jun 9 2026 4:54 AM

సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం/అక్కిరెడ్డిపాలెం: ఉద యం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు భార్యతో ‘సాయంత్రం త్వరగా వచ్చేస్తా’ అన్నారో కార్మికుడు.. ‘నాన్న వచ్చేటప్పుడు స్వీట్లు తీసుకురావా’ అని అడిగిన కూతురి తల నిమిరి ముద్దాడి వెళ్లారో తండ్రి.. ‘జాగ్రత్త నాయనా’ అని వెన్నుతట్టిన ముసలి తల్లికి ధైర్యం చెప్పి డ్యూటీకి బయలుదేరాడో కొడుకు.. రక్తాన్ని చెమటగా మార్చి, దేశ ప్రగతికి ఇనుప కవచాన్ని నిర్మించేందుకు ఆ చేతులు విశాఖ ఉక్కు కర్మాగారంలోకి అడుగుపెట్టాయి. కానీ, కాలం ఇంత క్రూరంగా మారుతుందని.. తాము నమ్ముకున్న కర్మాగారమే తమకు అగ్నిసమాధి అవుతుందని ఆ కార్మికులు ఊహించలేకపోయారు. ఒక్కటంటే ఒక్క క్షణం.. కేవలం ఆ ఒక్క క్షణంలో సంభవించిన అగ్నిప్రళయం ఎనిమిది మంది కార్మికులను మాంసపు ముద్దలుగా మార్చేసింది. కళ్లెదుటే ప్రాణాలు కరిగిపోతుంటే, కాపాడుకోలేక మిగిలిన శోకం.. ఉక్కునగరాన్ని కన్నీటి సముద్రంగా మార్చింది.

1600 డిగ్రీల అగ్నిప్రళయం

సోమవారం సాయంత్రం 4,15 గంటల సమయం.. ‘బీ’ షిఫ్ట్‌ విధులు సాఫీగా సాగిపోతున్నాయి. స్టీల్‌ మెల్ట్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌–1) విభాగంలో, నేలమట్టానికి దాదాపు 9 మీటర్ల ఎత్తున ఉన్న సీసీడీ సెక్షన్‌ అంతా కార్మికులు, అధికారుల అలికిడితో సందడిగా ఉంది. బ్లాస్ట్‌ఫర్నేస్‌లో ఎర్రగా కాగిన హాట్‌మెటల్‌ను భారీ లేడిల్‌లో ఎస్‌ఎంఎస్‌కు తరలించి, ద్రవపు ఉక్కుగా మార్చే కీలక ప్రక్రియ జరుగుతోంది. ఉత్పత్తి లక్ష్యాలను అందుకునే క్రమంలో సీసీడీ మిషన్‌–2 పై లేడల్‌ను ప్లేస్‌ చేసి, రొటేట్‌ చేయడం ప్రారంభించారు. అంతా సజావుగానే ఉందనుకున్న మరుక్షణమే.. ఊహకందని కాలసర్పంలా ఆ ఘోర విస్పోటనం సంభవించింది. ద్రవరూపంలో ఉన్న ఆ నిప్పుల నరకం షాప్‌ ఫ్లోర్‌పై సునామీలా దూసుకురావడంతో, చుట్టుపక్కల ఉన్న భారీ యంత్రాలు సైతం మంటల్లో చిక్కుకున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. కనీసం కళ్లు తెరిచి చూడడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ఎటు పరుగెత్తాలో కూడా తెలియని ఓ నరకప్రాయ వాతావరణం అక్కడ ఏర్పడింది.

ఊహకే అందని నరకయాతన!

100 డిగ్రీల సెల్సియస్‌ వద్ద మరిగే నీరు తగిలితేనే చర్మం ఊడిపోతుంది. అలాంటిది 1600 డిగ్రీల సెల్సియస్‌ అంటే పటిష్టమైన ఇనుము, రాళ్లు సైతం నీరులా కరిగిపోతాయి. ఈ అగ్ని ద్రవం మనిషి శరీరంపై పడితే.. కనీసం రక్తం కారడానికి, లేదా చర్మం కాలడానికి కూడా సమయం ఉండదు. క్షణాల వ్యవధిలో మాంసము, ఎముకలు సైతం బూడిదగా మారిపోతాయి. ఆ వేడి నుంచి వెలువడే శ్వాస గొంతులోకి వెళ్తే ఊపిరితిత్తులు క్షణంలో మాడిపోతాయి. ప్రమాద స్థలంలో కార్మికులు అనుభవించిన ఆ క్షణ కాల నరకయాతన వర్ణనాతీతం, హృదయవిదారకం.

కళ్లెదుటే కరిగిపోయిన మనుషులు

ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు, సహచర కార్మికులకు అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి కన్నీరు ఆగలేదు. నిలువెత్తు మనుషులు క్షణాల వ్యవధిలో బొగ్గు ముద్దలుగా మారిపోయారు. కనీసం వారు ధరించిన దుస్తులు గానీ, ముఖాలు గానీ ఆనవాళ్లు లేకుండా పోయిన స్థితి వర్ణనాతీతం. మరోవైపు శరీరమంతా కాలిన గాయాలతో, ప్రాణ రక్షణ కోసం క్షతగాత్రులు చేసిన ఆర్తనాదాలు ఉక్కునగర వాతావరణాన్ని శోకసంద్రంగా మార్చాయి. వారిని వెంటనే ప్లాంట్‌ జనరల్‌ ఆసుపత్రికి, నగరంలోని కిమ్స్‌, సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు ప్లాంట్‌ మెయిన్‌ గేట్‌ వద్దకు, ఆసుపత్రుల వద్దకు పరుగున చేరుకున్నారు. తమ వారు బతికే ఉన్నారో లేదో తెలియక, లోపలికి వెళ్లనివ్వక వారు ఆసుపత్రి కారిడార్లలో గుండెలు పగిలేలా ఏడుస్తున్న తీరు అక్కడున్న వారిని ద్రవింపజేసింది.

బతుకులు.. బుగ్గయ్యాయి

ఈ ఘోర ప్రమాద బాధితుల్లో మేనేజర్‌ స్థాయి అధికారి గోల్డ్‌ కుమార్‌ నుంచి.. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కాంట్రాక్ట్‌ కార్మికుల వరకు ఉన్నారు. నక్క వెంకటరమణ, త్రినాథ్‌, అప్పలరాజు వంటి కాంట్రాక్ట్‌ కార్మికుల ఇళ్లల్లో ఈ ప్రమాదం కోలుకోలేని చీకట్లను నింపింది. అరకొర జీతాలు, కనీస భద్రత లేని వాతావరణం.. అయినా సరే, కేవలం కుటుంబ పోషణ కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధుల్లో చేరిన ఆ పేద బతుకులు.. కరిగిన ఉక్కు సముద్రంలో కలిసిపోయాయి.

కన్నీరుమున్నీరు

‘నువ్వే పోతే మాకు దిక్కెవరు నాన్నా?‘ అని పిల్లలు, ‘పొద్దునే కదా కళ్లముందు తిరిగావు.. ఇంతలోనే శవమయ్యావా?‘ అంటూ మృతుల భార్యలు ఆసుపత్రి నేలపై పొర్లి ఏడుస్తుంటే.. అక్కడ ఉన్న పోలీసుల కళ్లు సైతం చెమర్చాయి. ఇప్పుడు ఆ అభాగ్య కుటుంబాలను ఆదుకునే నాథుడెవరు? తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పిల్లల భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.

మార్చురీ వద్ద ఉద్రిక్తత

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించాలని అధికారులు ప్రయత్నించగా, క్షతగాత్రుల కుటుంబీకులు, తోటి కార్మికులు అడ్డుకున్నారు. ‘మా వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమేంటో చెప్పాలి.. మాకు ఏం న్యాయం చేస్తారో తేల్చాలి’ అంటూ మార్చురీ ముందే బైఠాయించారు.

యాజమాన్యం నిర్లక్ష్యమేనా?

ఈ ఘోర దుర్ఘటనపై ఉక్కు కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను తుంగలో తొక్కడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కీలకమైన విభాగాల్లో కాలానుగుణంగా యంత్రాల ఫిట్‌నెస్‌ పరీక్షించకపోవడం వల్లే లాడిల్‌ పేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, మృతుల కుటుంబాలకు భారీ పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అమ్మని బాగా చూసుకోరా

కంటతడి పెట్టిస్తున్న క్షతగాత్రుడి వీడియో

వర్మా.. తమ్ముడి మీద ఎప్పుడూ చిరాకు పడకే.. తమ్ముడిని బాగా చదివించురా...నువ్వు కూడా బాగా చదువుకోమ్మా... అమ్మని బాగా చూసుకోండి...ఉంటాను డాడీ...అంటూ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పైడిరాజు వీడియో అందర్నీ కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. ఒంటినిండా గాయాలతో చికిత్స పొందుతున్న ఆ బాధితుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో పిల్లలకు జాగ్రత్తలు చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు.

నవ్వుతూ వెళ్లిన నాన్న నల్లటి ముద్దయ్యాడు

నాన్న ఎప్పుడు వస్తారు? అని అడుగుతున్న చిన్నారులు

సాయంత్రానికి మార్చురీల వద్ద గుండెలవిసేలా రోదనలు

కేంద్ర మంత్రి కుమారస్వామి

ప్లాంట్‌ సందర్శన

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

మహారాణిపేట: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై పూర్తి సమాచారం ప్రజలకు, సంబంధిత సంస్థలకు అందుబాటులో ఉండేలా కలెక్టర్‌ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు, క్షతగాత్రుల సమాచారం కోసం 0891–2590100, 0891–2590101, 0891–2590102 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేందుకు గుర్తించిన ఆస్పత్రులకు ప్రత్యేక ఇన్‌చార్జీలను నియమించినట్లు కూడా వెల్లడించారు. మెడికవర్‌ హాస్పిటల్‌ (ఇసుకతోట)– ప్రత్యేక ఉప కలెక్టర్‌ : 91000 64971, ఎంజీఎం–సెవెన్‌ హిల్స్‌ (రాంనగర్‌)– ఆర్‌డీవో సంగీత్‌ మాధుర్‌ : 98499 03852, కిమ్స్‌ ఐకాన్‌ హాస్పిటల్‌ , షీలానగర్‌, గోపాలపట్నం తహసీల్దార్‌ : 9100064976, స్టీల్‌ ప్లాంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, ఉక్కునగరం, గాజువాక తహసీల్దార్‌ త్రినాథ్‌: 98499 03843

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..

డాబాగార్డెన్స్‌: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని సిఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, అధ్యక్షుడు కేఎం శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో ఆరోపించారు. కాలం చెల్లిన యంత్రాలు వాడడం, నాసిరకం ముడిసరుకు, సరైన మెయింటెనెన్స్‌ లేకపోవడం వల్లే లాడిల్‌ పేలి 8 మంది కార్మికులు ప్రా ణాలు కోల్పోయారని మండిపడ్డారు. ప్లాంట్‌ ప్రైవేటీకరణ కుట్రల్లో భాగంగానే భద్రతను గాలికొదిలేసి, అనుభవం లేని కాంట్రాక్ట్‌ కార్మికులతో పనులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement