గోవాడ రైతుల సమస్యలపై పోరాటానికి సిద్ధం | - | Sakshi
Sakshi News home page

గోవాడ రైతుల సమస్యలపై పోరాటానికి సిద్ధం

Jun 9 2026 4:54 AM | Updated on Jun 9 2026 4:54 AM

ఫ్యాక్టరీని మూసేసి రైతులను రోడ్డున పడేసిన చంద్రబాబు ప్రభుత్వం

మాజీ మంత్రి అమర్‌నాథ్‌, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ధ్వజం

చోడవరంలో వెన్నుపోటు ప్రభుత్వానికి రెండేళ్లు ఫొటో ప్రదర్శన

చోడవరం: గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ చెరకు రైతుల తరపున త్వరలో వైఎస్సార్‌సీపీ పోరాటం చేయడానికి సిద్ధమవుతుందని ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల ముందు గోవాడ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పి తర్వాత ఏకంగా దాన్ని మూసేసిన చంద్రబాబు ప్రభుత్వం మోసాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన సమయం వచ్చిందన్నారు. సూపర్‌ సిక్స్‌ మోసాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లు దశల వారీగా నిరసన కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా రెండేళ్లలో రాష్ట్రంలోను, జిల్లాలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాలు, దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ చోడవరంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో చోడవరం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఏకై క అతిపెద్ద గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ 2024 సీజన్‌ వరకూ ఎంతో చక్కగా క్రషింగ్‌ చేస్తూ రైతులకు సకాలంలో బకాయిలు ఇచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూసేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 వేల మంది సభ్య రైతులు, 2 లక్షల మంది ప్రత్యక్ష, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న రైతు, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడేలా చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ఆధునికీకరించి టన్నుకు రూ. 4 వేలు గిట్టుబాటు ధర ఇస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక పాత బకాయిలు ఇవ్వకపోగా, రెండేళ్లుగా ఫ్యాక్టరీ మహాజన సభలు సైతం నిర్వహించ లేదని ధ్వజమెత్తారు. రైతుల తరపున పోరాటం చేసి, చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసాన్ని అందరికీ తెలియజేయడంతోపాటు ఫ్యాక్టరీని తెరిపించి, పాత బకాయిలు చెల్లించేలా వైఎస్సార్‌సీపీ ఉద్యమానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో అర్హత ఉన్న ఓట్లు తొలగించకుండా గ్రామాల్లోకి వస్తున్న సర్వే అధికారులతో కలిసి బూత్‌ ప్రతినిధులు పనిచే యాలని సూచించారు. ఈ నెల 12వ తేదీన చోడవరంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని అమర్‌నాథ్‌ కోరారు. కార్యక్రమంలో మహిళా విభాగం జోన్‌ –1 అధ్యక్షురాలు ఈర్లె అనురాధ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, రాష్ట్ర బీసీ సెల్‌ కార్యదర్శి పల్లా నర్సింగరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొళ్లిమళ్ల అచ్చెంనాయుడు, సీడీసీ చైర్మన్‌ సుంకర శ్రీనివాసరావు, రైతు విభాగం అధ్యక్షుడు నాగులాపల్లి రాంబాబు, బూరె బాబూరావు, కర్రి సత్యం, పలు మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement