గాజువాక : స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. ఉక్కు ప్రమాద మృతులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత రెండేళ్లుగా వీఆర్‌ఎస్, రిటైర్‌మెంట్‌వాళ్లతో కలుపుకొని సుమారు 9,500 మంది కార్మికులను తొలగించారన్నారు. ఉన్న కార్మికులపై విపరీతమైన ఒత్తిడి పెంచారని, ఉత్పత్తి ఆధారితంగా జీతాలు చెల్లిస్తామని షరతు పెట్టారని అన్నారు. దీనివల్ల కార్మికులపై అదనపు భారం పడిందన్నారు. మొన్నటివరకు పది మంది చేయాల్సిన పనిని ఇప్పుడు ముగ్గురు చేస్తున్నారన్నారు. కార్మికులపై అంత భారం పడినప్పుడు వారికి కల్పించాల్సిన భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. భద్రతా ప్రమాణాలు తీసుకోకపోవడమే కాక, సీనియర్ ఉద్యోగులను బలవంతంగా వీఆర్‌ఎస్ పెట్టించేసి, ఉన్నవాళ్లపై ఒత్తిడి పెంచారన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు యాజమాన్యం ఆ బాధ్యత కూడా తీసుకోకుండా ఈరోజు ఇంతమంది కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, యాజమాన్యం బాధ్యత తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కనీసం కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.


