సాగు భూములు ఖాళీ చేయాలని బెదిరింపులు
తుమ్మపాల: అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకే సమస్యపై పదే పదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా శాశ్వత పరిష్కారం కావడం లేదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వారం సైతం 281 అర్జీలు నమోదు కావడం గమనార్హం. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ మందిరంలో కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి, డీఆర్వో వై.సత్యనారాయణరావు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఏడీ సర్వే, ఇరిగేషన్, బీసీ వెల్ఫేర్, ఏపీఎస్‌ఆర్టీసీ, డ్వామా, తాగునీరు తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పెండింగ్ అర్జీలు అధికంగా ఉన్న శాఖల అధికారులకు ప్రత్యేక సూచనలు జారీ చేస్తూ, సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ వారం మొత్తం – 281 వినతులు రాగా, వాటిలో రెవెన్యూ క్లినిక్ –143, పీజీఆర్‌ఎస్ –138 నమోదయ్యాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాశీపురంలో ఏళ్ల తరబడి తీరని మురుగు వ్యధ
ఏళ్ల తరబడి తీరని వ్యధగా ఉన్న మురుగు కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ దేవరాపల్లి మండలం కాశీపురం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. స్వచ్ఛభారత్ పేరుతో పంచాయతీకి నిధులు మంజూరవుతున్నా పాత పోస్టాఫీసు సమీపంలో దుర్గంధంగా తయారైన కాలువను కనీసం పట్టించుకోవడం లేదని, అనేకసార్లు అర్జీలు చేసినా బుట్టదాఖలు చేస్తున్నారని, దాదాపు వంద నివాసాల మురుగునీరు దిగువకు పోకుండా నిలిచిపోతుందని, దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడంతో వర్షాలు పడినప్పుడు ఇళ్లలోకి చేరుతుందని, పాలకులు, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
తాగునీరు లేక అర్జీదారుల విలవిల
కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో అర్జీదారుల దాహం తీరేందుకు చుక్కనీరు కూడా దొరకలేదు. రెండు వారాల క్రితం కలెక్టరేట్ బయట ఆర్భాటంగా ప్రారంభించిన మజ్జిగ చలివేంద్రం చుట్టుపు చూపుగానే పెట్టి మూసేశారు. మజ్జిగ లేదు కదా.. కనీసం మంచినీరు కూడా లేకపోవడంతో అర్జీదారులు మండుటెండలో దాహంతో ఇబ్బందులు పడ్డారు. అర్జీలు రాసేందుకు సరైన సౌకర్యాలు లేక అనేక మమంది ఎండలోనే నిల్చోని తమ సమస్యలపై అర్జీలు రాసుకున్నారు. పలువురు వృద్ధులు గంటల తరబడి కలెక్టరేట్ బయటే అధికారుల రాక కోసం నిరీక్షించారు. అధికారులు మాత్రం చుట్టపు చూపుగానే వచ్చి అర్జీలు తీసుకుని వెళ్లిపోవడంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు.
రావికమతం: ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తూ ఆధారపడి జీవనం సాగిస్తున్న భూములను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కొంతమంది రాజకీయ పలుకుబడితో బెదిరిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ జోక్యం చేసుకొని న్యాయం చేయాలని చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట గ్రామానికి చెందిన ఆదివాసీలు కోరుతున్నారు. దీనిపై సోమవారం కలెక్టర్, ఎస్పీలకు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. కళ్యాణపులోవ జలాశయం ఎగువన జెడ్.జోగుంపేటలో పదెకరాల భూములను తరతరాలుగా తాము సాగు చేస్తున్నామన్నారు. వాటిని హైదరాబాద్‌కు చెందిన చుండూరు ఉషారాణి, ఆమె భర్త నాగేఽశ్వరరావు 2025 నుంచి ఖాళీ చేయాలని వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. వారి నుంచి తమకు రక్షణ కల్పంచి న్యాయం చేయాలని ఆదివాసీలు చీడిపల్లి దేముడమ్మ, రెచుకట్ల లోవమ్మ కోరారు. అఖిల భారత వ్యవసాయ గ్రామీణ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. జనార్దన్ మాట్లాడుతూ ఆదివాసీల భూములను పెత్తందారులు రాజకీయ పలుకుబడితో ఖాళీ చేయాలని బెదిరించడం దారుణమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పింఛన్ అడిగితే కేసు నమోదు చేశారు?
‘పింఛన్ సొమ్ము ఇవ్వలేదని గ్రామ సచివాలయంలో అడిగినందుకు నా కుమారుడిపై కేసు నమోదు చేసి వేధిస్తున్నారని, దళిత వృద్ధురాలిలైన నన్ను, నా కుమారుడ్ని తీవ్ర దుర్భాషలాడిన సచివాలయ ఉద్యోగిపైనా కేసు నమోదు చేసి మాకు న్యాయం చేయాలి’ అంటూ పాయకరావుపేటకు చెందిన మారెళ్ల అప్పలనర్స కలెక్టరేట్ బయట ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెల 1న మా ఇంటి వద్ద పింఛన్ నగదు ఇవ్వలేదు. 2న సచివాలయానికి వెళ్లి అడిగినందుకు ఆగలేరా అంటూ మాపై దురుసుగా ప్రవర్తించారని, పింఛన్ ఇవ్వకపోవడంతో మందులు కొనుక్కోలేకపోయానని, రోజువారి మాత్రలు లేక ఇబ్బంది పడుతున్నానంటూ ఆవేదన వెళ్లబుచ్చింది. నా కుమారుడు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని పోలీసులు సచివాలయ ఉద్యోగి తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేయడం దారుణమంది. న్యాయం కోసం కలెక్టర్‌ను కలిసేందుకు వస్తే లోపలికి పంపించడం లేదని వాపోయింది. దివ్యాంగులు, వృద్ధులు కలెక్టర్‌ను కలిసే అవకాశం లేదని, కింద అధికారులు వస్తారని బయటే ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేసింది.


