ఇంటింటి సర్వే పారదర్శకంగా ఉండేటట్టు చూసుకోవాలి
అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తప్పిపోకుండా చూసుకోవాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ
అనకాపల్లి టౌన్: ఓటరు జాబితాల నిర్వహణలో బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్‌ఏ) పాత్ర అత్యంత కీలకమని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ అన్నారు. పట్టణంలోని న్యూకాలనీ రోటరీ కల్యాణ మండపంలో నియోజకవర్గ పరిధిలోని 251 మంది బీఎల్‌ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై ప్రత్యేక శిక్షణ కార్య క్రమం నిర్వహించారు. సమన్వయకర్త భరత్‌కుమా ర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి (కోఆర్డినేషన్) హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొని ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణ దరఖాస్తుల సమర్పణ విధివిధానాలపై అవగాహన కల్పించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్‌ఏ లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పార్టీ నియమించిన ఏజెంట్లు ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే చేపట్టాలని, పార్టీకి పడే ఏ ఒక్క ఓటూ జాబితా నుంచి తొలగిపోకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో 23 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితాపై సమగ్ర రివిజన్ జరుగుతోందని, ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం ఆమోదించిన ఏవైనా రెండు గుర్తింపు కార్డులు (డాక్యుమెంట్లు) తప్పనిసరిగా ఉండేలా ఓటర్లను నేరుగా కలిసి చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. 100 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో అధికారులు ఓటర్ల తొలగింపు, సవరణలను పారదర్శకంగా నిర్వహిస్తున్నారో లేదో నిరంతరం గమనించాలన్నారు. ముఖ్యంగా ద్వంద్వ ఓట్ల (డబుల్ ఓట్లు) నమోదుపై తగిన ఆధారాలు సేకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎక్కడైనా అర్హులైన వారి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నట్లు గమనిస్తే, వెంటనే ఆ ఓటరు పూర్తి వివరాలను పార్టీ లీగల్ టీమ్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు తయారయ్యే ఓటర్ల జాబితాయే భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీ విజయానికి కీలకం కానుందని, కాబట్టి ప్రతి ఏజెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వంపై విమర్శలు
కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయలేకపోతోందని జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. దొడ్డిదారిలో ఒక్కో డీఎస్సీ పోస్టును రూ.లక్షలకు అమ్ముకుంటూ అర్హులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రైతులు, జర్నలిస్టులు, మహిళలపై దాడులు, అత్యాచారాలకు సంబంధించిన ఫొటోలను తెరపై ప్రదర్శిస్తూ చంద్రబాబు నిరంకుశ పాలనను సమన్వయకర్త భరత్ కుమార్ ఎండగట్టారు. యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500 సాయం, అమ్మఒడి, కొత్త పింఛన్లు వంటి ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు.
నియోజకవర్గ పరిశీలకులు సతీష్ వర్మ మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ఓట్లను అడ్డదారిలో తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలన్నారు. నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంజూరై నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మాట్లా డుతూ ప్రతి ఓటూ కీలకమైందని, బూత్ లెవెల్ ఏజెంట్లు ఇళ్లకు వెళ్లినప్పుడు ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి ఓటు నమోదుకు అవసరమైన వివరాలను సేకరించాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబా బు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షు డు జాజుల రమేష్, వివిధ వార్డుల ఇంచార్జ్ లు కె.ఎమ్. నాయుడు, బొడ్డేడ శివ, కోరుకొండ రాఘవ, అల్లు త్రినాథ్, బుద్ధ భాస్కర్ రావు, మళ్ల బుల్లిబాబు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


