నక్కపల్లి/అనకాపల్లి: ఉపమాక వేంకటేశ్వర స్వా మి ఆలయంలో ఈనెల 3వ తేదీన జరిగిన చోరీకి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తుహిన్‌సిన్హా విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆలయంలో భారీ చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈనెల 3వ తేదీ రాత్రి ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి ఉపమాక ఆలయ ప్రాంగణంలోకి వెనుక ప్రాంతం నుంచి ప్రవేశించారన్నారు. ఆస్థాన మండపంలో ఉన్న హుండీని, ఆండాళ్లమ్మవారి సన్నిధిలో ఉన్న హుండీని కట్టర్‌తో కట్‌చేసి వాటిలో భక్తులు స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలతోపాటు, నగదును అపహరించారన్నారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి క్లూస్ టీములను రంగంలోకి దించి విచారణ ప్రారంభించామన్నారు. నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల సీఐల నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. సీసీ ఫుటేజీ లద్వారా విచారణ వేగవంతం చేసామన్నారు. దీనిలో భాగంగా ఈనెల 7వ తేదీన ఉద్దండపురం బస్టాప్‌లో ఇద్దరు అనుమానిత వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఈ చోరీ చేసింది తామేనని అంగీకరించారన్నారు. నక్కపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన కశిరెడ్డి శ్రీహరి, గంట్యాడ చిన్నలను అరెస్టు చేసామన్నారు. వీరి నుంచి రూ.2.38,078 నగదు, సమారు రూ. 8 లక్షల విలువైన బంగారు కానుకలు (56 గ్రాములు) సుమారు రూ.7.20 లక్షలు విలువైన 2.600 గ్రాముల వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. వీటి మొత్తం విలువ రూ.17.68 లక్షలుంటుందని ఎస్పీ చెప్పారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. నగదు ఆభరణాలతోపాటు, నేరానికి ఉపయోగించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ జరిగిన ఐదురోజుల వ్యవదిలోనే కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడంతో పాటు నూరుశాతం చోరీ సొత్తును స్వాధీనం చేసుకోగలిగామన్నారు. ఈ కేసు చేధించడంలో నర్సీపట్నం డీఎప్పీ పి.శ్రీనివాసరావు, సీఐలు మురళి, రామకృష్ణ, అప్పలనాయుడలతోపాటు, ఎస్‌ఐలు సన్ని బాబు, సాహెబా అంజుమ్, మహ్మద్ ఆలీ షరీఫ్ ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి వారి కి నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలో అన్ని ప్రధాన దేవాలయాల వద్ద భద్రతా చర్యల్ని కట్టుదిట్టం చేయాలని, రాత్రి గస్తీ నిర్వహించాలని ఆదేశించినట్టు ఎస్పీ తెలిపారు.


