విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
విద్యుత్ సరఫరాకు అంతరాయం
నర్సీపట్నంలో వడగళ్ల వర్షం
జలమయమైన రోడ్లు
నర్సీపట్నం – రేవుపోలవరం రహదారిలో ట్రాఫిక్ జామ్
నర్సీపట్నం/కోటవురట్ల: నర్సీపట్నం, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు సూర్యుడు నిప్పులు చెరిగాడు. తీవ్ర వడగాడ్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచోసుకుని ఈదురుగాలులు వీచాయి. నర్సీపట్నంలో పెద్ద ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, హోర్డింగ్‌లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మెయిన్ రోడ్డు అబిద్ సెంటర్లోని సెంట్రల్ లైటింగ్ విద్యుత్ స్తంభం నేల కొరిగింది. మున్సిపల్ స్టేడియంలోని చెట్లు విరిగి పడడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. నర్సీపట్నం మెయిన్ రోడ్డు, అబిద్ సెంటర్, మున్సిపల్ స్టేడియం ప్రాంతాలు జలమయమై చెరువులను తలపించాయి. భారీవర్షం,ఈదురుగాలులతో రాత్రి 9:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలో అంధకారం అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కోటవురట్ల మండలం యండపల్లి శివారులో పలు వృక్షాలు మెయిన్‌రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డాయి. నర్సీపట్నం – రేవుపోలవరం రహదారిలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రెండు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ప్రయాణికులు సుమారు గంట పాటు ఇబ్బంది పడ్డారు. సమాచారం తెలుసుకున్న కోటవురట్ల ఎస్‌ఐ విజయ్ కుమార్ అక్కడకు చేరుకుని రహదారి పై అడ్డంగా పడివున్న చెట్లను పొక్లెయిన్‌తో తొలగింపజేసి, ట్రాఫిక్ క్లియర్ చేయడంతో వాహనదారులు ఊపిరి పిల్చుకున్నారు.


