ఈ నెల 15 నుంచి నుంచి మత్స్య వేట ప్రారంభం డీజిల్ ఆయిల్ కోసం మత్స్యకారుల ఎదురుచూపులు మత్స్యకారులకు సంకటంగా మారిన సంధి కాలం సాధారణ డీజిల్ ధర రూ.104,10 రూ.9 పరిమితమైన ఆయిల్ సబ్సిడీ లీటర్‌కు రూ.25 సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్
భరోసా ఎగ్గొట్టారు.. సబ్సిడీ ఆపేశారు..
మహారాణిపేట: వేట నిషేధ కాలం ముగిసి, ఈ నెల 15 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వారి బతుకులను సంకటంలోకి నెట్టింది. వేట ప్రారంభానికి వారం రోజుల సమయం కూడా లేని ఈ సంధి కాలంలో, బోట్లను నడపడానికి అత్యంత కీలకమైన రాయితీ డీజిల్ ఆయిల్‌ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం తీర ప్రాంతంలో తీవ్ర ఆందోళన రేపుతోంది. అప్పులు తెచ్చి బోట్లను మరమ్మతులు చేయించుకున్న యజమానులు ఇప్పుడు సబ్సిడీ ఆయిల్ రాక, వేటకు వెళ్లలేక అగమ్యగోచర స్థితిలో పడ్డారు. ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు రూ.104.10 పైసలకు చేరినా, ప్రభుత్వం మాత్రం పాత తొమ్మిది రూపాయల సబ్సిడీనే కొనసాగించడం మత్స్యకారుల నడ్డి విరుస్తోంది. పెరుగుతున్న ధరల దృష్ట్యా డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.25కు పెంచాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదికి సంబంధించిన ‘మత్స్యకార భరోసా’ నిధులను ఎగ్గొట్టడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఇంకా ఎంతోమంది అర్హులకు ఈ సాయాన్ని అందకుండా నిలిపివేసింది. ప్రభుత్వ ఆర్థిక సాయం అందక, డీజిల్ కొరతతో ఇప్పటికే నష్టాలతో కునారిల్లుతున్న మత్స్య పరిశ్రమను కూటమి సర్కార్ మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని మత్స్యకార వర్గాలు మండిపడుతున్నాయి.
అమ్మవారికి పూజలతో వేటకు శ్రీకారం
ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీ మంగళవారం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో శ్రీశ్రీశ్రీ గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయంగా గంగమ్మ తల్లి ఆశీస్సులతోనే వేట ప్రారంభించే మత్స్యకారులు, జాతర అనంతరం అధికారికంగా సముద్రంలోకి వెళ్లనున్నారు.
మత్స్యకారుల ఆందోళన
అయితే ప్రస్తుతం సబ్సిడీ డీజిల్ సరఫరాపై స్పష్టత లేకపోవడంతో వేట ప్రారంభానికి ముందు మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో సబ్సిడీ అందకపోతే నిర్వహణ వ్యయం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
ప్రస్తుతం మత్స్య పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయని పేర్కొంటూ చమురు సంస్థలు ఇటీవల కాలంలో పలు మార్లు డీజిల్ ధరలను పెంచాయి. గతంలో లీటరు డీజిల్ ధర రూ.96.22 ఉండగా, ప్రస్తుతం అది రూ.104.10కు చేరుకుంది. ఈ పెరుగుదల మత్స్యకారుల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచింది.
భారంగా మారిన డీజిల్ ధరలు
32 కి.మీ. మేర తీరప్రాంతం
విశాఖ జిల్లా పరిధిలో 32 కిలోమీటర్ల తీరప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 667 మరపడవలు, 3,094 మోటారు పడవలు, 611 సంప్రదాయ ఇంజిన్ లేని తెప్పలు ఉన్నాయి. వేలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.
ఇంకా అందని ఆయిల్ సబ్సిడీ
మరో వారం రోజుల్లో వేట ప్రారంభం కానున్నప్పటికీ, మత్స్యకారులకు అందాల్సిన డీజిల్ ఆయిల్ సబ్సిడీ ఇంకా విడుదల కాలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల ద్వారా ప్రతి నెల ఒక్కో బోటుకు 3 వేల లీటర్ల చొప్పున సబ్సిడీ డీజిల్ అందించేవారు. దీంతో బోటు యజమానులకు నెలకు రూ.27 వేల వరకు ఆదా అయ్యేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు.
డీజిల్ సబ్సిడీ పెంచాలి
చంద్రబాబు ప్రభుత్వం లీటరు డీజిల్‌పై రూ.9 సబ్సిడీ అందిస్తోంది. అయితే గతంలో డీజిల్ ధర లీటరుకు రూ.70 ఉన్న సమయంలో కూడా ఇదే స్థాయిలో సబ్సిడీ అందించేవారని మత్స్యకారులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ధరలు రూ.100 దాటినా సబ్సిడీ మొత్తంలో ఎలాంటి పెంపు లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సబ్సిడీని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
మత్స్య పరిశ్రమపై నిర్లక్ష్యం వీడాలి
రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. డీజిల్ ధరలు భరించలేని స్థాయిలో పెరిగిపోవడంతో మత్స్యకారులు, బోటు యజమానులు ఎలా బతకాలో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికై నా సర్కార్ నిర్లక్ష్యం వీడి, లీటర్ డీజిల్‌పై రూ.25 సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఆప్కాఫ్ చార్జీలను తక్షణమే రద్దు చేయాలి. మత్స్యకారులను వలసల బాట పట్టించే విధానాలను ఆపాలి. ఈ సమస్యలపై హార్బర్లలోని సాంప్రదాయ మత్స్యకారులు, సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి మత్స్య పరిశ్రమను కాపాడాలి.
–జానకిరామ్ వాసుపల్లి, ప్రెసిడెంట్, మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్


