ర్లక్ష్యం మితిమీరె..
రెగ్యులర్ సిబ్బందిపై చర్యలేవీ?
నక్కపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ లో ఉన్న ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంభద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తవ్వేకొద్దీ లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల క్రితం ఆలయంలో చోరీ జరిగి, రూ.4లక్షల పైగా కానుకలు దుండగులు ఎత్తుకుపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీటీడీ అధికారుల నిర్ణక్ష్యం వల్లే ఈ చోరీ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చోరీకి బాధ్యులను చేస్తూ ఇద్దరు కాంట్రాక్ట్‌సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించి టీటీడీ అధికారులు చేతులు దులుపేసుకున్నారని భక్తులు మండి పడుతున్నారు.
ఏడాదిగా పనిచేయని పలు సీసీ కెమెరాలు
ఆలయంలో చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏడాదిగా పనిచేయడం లేదు. మొత్తం 25 కెమెరాలకు గాను ఏడు కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఆలయం వెలుపల ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు పనిచేయకపోవడం వల్లే దుండగులు సులువుగా ఆలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సీసీకెమెరాల నిర్వహణను టీటీడీ విజిలెన్స్ విభాగం, స్థానిక టెంపుల్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షించాలి. ఇక్కడ కెమెరాలను తిరుమలలో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ విభాగానికి అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది. ఉపమాక ఆలయంలోనే కాకుండా తిరుమలనుంచి కూడా ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలించే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఆలయంలోకి ఎవరైనా ప్రవేశిస్తున్నారా అనేది తిరుమల నుంచి కూడా గమనించవచ్చు. మరి అక్కడ విజిలెన్స్ సిబ్బంది గత మంగళవారం రాత్రి ఏంచేశారు, ఇక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డుల మాదిరిగానే వారు కూడా నిద్రపోయారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిఏటా మార్చిలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు ఘనంగా జరుగుతాయి. సుమారు రెండు లక్షల మందిపైనే భక్తులు భక్తులు దర్శనానికి వస్తారు. గతంలో టీటీడీ జేఈవో స్థాయి అధికారి కల్యాణోత్సవాలకు నెలరోజుల ముందుగానే వచ్చి ఏర్పాట్లు పరిశీలించేవారు. చంద్రబాబు ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయి అధికారి రాలేదు. ఈ ఏడాది కల్యాణోత్సవాల సమయానికే ఆలయంలో సీసీ కెమెరాలు పూర్తిగా పనిచేయడం లేదు.
పరకామణి లెక్కింపు మూడుసార్లు వాయిదా ?
కల్యాణోత్సవాల సందర్భంగా హోంమంత్రి వంగల పూడి అనిత రెండు పర్యాయాలు ఆలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విశాఖ సబ్‌ట్రెజరీలో భద్రపరచిన స్వామివారికి చెందిన వేలకోట్ల విలువైన బంగారు ఆభరణాలను వజ్రవైఢూర్యాలను ఐదు రోజుల పాటు అలంకరించనున్న నేపథ్యంలో బందోబస్తు పటిష్టంగా ఉండాలని సూచించారు. సీసీకెమెరాలు పనిచేయడం లేదన్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మంత్రి తక్షణమే రిపేరు చేయించాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలను అధికారులు బేఖాతరు చేశారు.సీసీకెమెరాలు పనిచేయకపోవడం వల్లే గతంలో పరకామణి లెక్కింపును మూడు సార్లు వాయిదా వేసినట్లు సమాచారం. రుషికొండ ఆలయ ఈవో సూచనల మేరకు ఆలయ ప్రధానార్చకుడు తన సొంత సొమ్ముతో పరకామణి నిర్వహించే ప్రాంతాల్లో ఉన్న కెమెరాలను రిపేరు చేయించినట్లు తెలిసింది. కల్యాణోత్సవాల సందర్భంగా గత్యంతరం లేకే స్థానిక పోలీసులు తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి నిఘాలో ఉత్సవాలను నిర్వహించారు.అయినా టీటీడీ అధికారుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. కొండ దిగువన ఆస్థాన మండపంలోను, ఆండాళ్లమ్మవారి సన్నిధిలో హుండీలను పగుల గొట్టిన దుండగులు, కొండపై మూలమూర్తి ఉన్న గర్భాలయ తలుపులను పెకిలించే ప్రయత్నం చేశారు. గర్భాలయంలో ఉన్న హుండీని కొల్లగొట్టే ప్రయత్నంలో భాగంగా తలుపులకు ఏర్పాటు చేసిన ఇత్తడి రేకులను ఊడతీశారు. తలుపులు పటిష్టంగా ఉండడంతో వదిలేశారు. చోరీ జరిగి ఐదురోజులు గడుస్తున్నా దుండగులు పెకలించిన తలుపులను టీటీడీ అధికారులు ఇప్పటి వరకు రిపేరు చేయించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఉపమాక ఆలయంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న లోపాలు
ఉపమాక వేంకటేశ్వర స్వామిఆలయం
హోంమంత్రి
ఆదేశాలు బేఖాతరు
పోలీసుల కెమెరాలతోనే
కల్యాణోత్సవాలు
కాంట్రాక్ట్ ఉద్యోగులే బలిపశువులు
ఉపమాక ఆలయంలో జరిగిన చోరీకి సంబంధించి స్థానికులైన కాంట్రాక్టు సెక్యూరిటీ సిబ్బందిని బలిపశువులను చేశారు. వారిని ఉద్యోగం నుంచి తొలగించారు. పూర్తిస్థాయి బాధ్యత వహించాల్సిన స్థానిక ఇన్‌స్పెక్టర్, విజిలెన్స్ విభాగ అధికారిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈచోరీ ఘటనలో రెగ్యులర్ ఉద్యోగులను టీటీడీ వెనుకేసుకు వస్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా టీటీడీ వారు ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, స్వామివారి కానుకలు, ఆభరణాలకు రక్షణ కల్పించాలని,భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.


