4 పోర్టులు, కీలక వర్క్‌షాప్‌లు, లోకోషెడ్లతో ఆదాయార్జనకు ఊతం ఏటా రూ.20 వేల కోట్ల వరకు రాబడికి అవకాశం రైళ్ల నిర్వహణ, మరమ్మతులకు స్వయం సమృద్ధి దిశగా అడుగులు జోనల్ హాస్పిటల్, టౌన్‌షిప్‌తో మౌలిక సదుపాయాల విస్తరణ
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ కీలక శక్తిగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది. సరుకు రవాణాకు జీవనాడిగా నిలిచే నాలుగు ప్రధాన పోర్టులు, రైళ్ల నిర్వహణకు వెన్నెముకలైన లోకోషెడ్లు–వర్క్‌షాప్‌లు, వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు జోన్ పరిధిలోకి రానుండటంతో విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న ఈ జోన్ ఆర్థికంగా, పరిపాలనా పరంగా మరింత బలోపేతం కానుంది. వార్షికంగా రూ.17,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖ డివిజన్‌లోని కీలక ఆస్తులు, సదుపాయాలు జోన్‌లో విలీనం కానున్నాయి. రైళ్ల నిర్వహణ, మరమ్మతులు, సరుకు రవాణా, సాంకేతిక శిక్షణ తదితర అంశాల్లో ఇతర జోన్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా దక్షిణ కోస్తా రైల్వే జోన్ రూపుదిద్దుకుంటోంది.
జోన్‌కు 4 పోర్టుల బలం
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆదాయానికి ప్రధాన ఆధారంగా నిలిచే 4 కీలక ఓడరేవులు పూర్తిగా ఈ జోన్ పరిపాలనా నియంత్రణలోకి రానున్నాయి. విశాఖపట్నం, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ద్వా రా భారీ స్థాయిలో సరుకు రవాణా జరుగుతోంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం జోన్‌కు ఆర్థిక బలాన్ని చేకూర్చనుంది. గూడ్స్ రైళ్ల తనిఖీలు, నిర్వహణ కోసం వాల్తేరు, విజయవాడ, గుత్తి, కాకినాడ పోర్టుల వద్ద ఉన్న నాలుగు మేజర్ ఫ్రైట్ ఎగ్జామినేషన్ యార్డులు కూడా జోన్ పరిధిలోకి రానున్నాయి.
ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం
విశాఖలో ఉన్న శాటిలైట్ డిపో ఫర్ ట్రాక్ మెషీన్స్ విశాఖ డివిజన్ పరిధిలోనే ఉంటుంది. రాయగడకు బదిలీ చేసినవి మినహాయిస్తే మిగిలిన 3 ఆపరేటింగ్ సెక్షన్ కంట్రోల్స్, ఒక టీపీసీ సెక్షన్ బోర్డు, ఇంజనీరింగ్, సీ అండ్ డబ్ల్యూ, సెక్యూరిటీ కంట్రోల్ విభాగాలు కూడా విశాఖ డివిజన్‌లోనే ఉంటాయి. ఇలా.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ తన సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా విస్తరింపజేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. పోర్టుల ద్వారా సరుకు రవాణా, నిర్వహణా కేంద్రాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ద్వారా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏటా రూ.17,550 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేకే లైన్ కూడా జోన్‌లో విలీనం చేసి ఉంటే ఈ ఆదాయం రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల స్థాయికి చేరుకునేదని చెబుతున్నారు.


