● ఆందోళనకారులకు మద్దతు పలికిన
వైఎస్సార్ సీపీ నేతలు
రాంబిల్లి(అచ్యుతాపురం): పంచదార్ల కొండపై యథేచ్ఛగా సాగుతున్న గ్రావెల్ తవ్వకాలపై వెంకటాపురం గ్రామస్తులు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంబిల్లి మండలంలోని వెంకటాపురం,పంచదార్ల గ్రామాల పరిధిలో చేపడుతున్న గ్రావెల్ తవ్వకాలతో ఏర్పడిన గోతులను ఫణిగిరి, పంచదార్ల కొండల సంరక్షణ సంస్థ సభ్యులు,వైఎస్సార్ సీపీ నియోజక వర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ నేతృత్వంలోని పలువురు నేతలు పరిశీలించారు.రెండెకరాల్లో క్వారీ నిర్వహణకు అనుమతి ఉందని చూపిస్తూ రోజుకి వందలాది వాహనాల్లో గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారని స్థానికులు మండిపడ్డారు.ఎంపీ రమే ష్‌ను ఇక్కడికి రావాలని, నిర్వాహకులను రప్పించాలని పలువురు నినాదాలు చేశారు.నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఎలా అనుమతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత లు ప్రశ్నించారు.ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాల వల్ల పంచదార్ల,హరిపురం,వెంకటాపురం గ్రామాల ప్రజల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంత సేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.కార్యక్రమంలో రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు,శ్రీనుబాబు,కిశోర్‌రాజు,చేపల గోవింద్, వైఎస్సార్ సీపీ అచ్యుతాపురం మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్‌రావు పాల్గొన్నారు.
న్యాయ పోరాటం చేస్తాం
పంచదార్ల కొండను కాపాడేందుకు న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్ సీపీ యలమంచిలి నియోజక వర్గ సమన్వకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. క్వారీ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.రాయలసీమకు చెందిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా క్వారీని అప్పగించారని ఆయన ఆరోపించారు.ఎంపీ రమేష్,ఎమ్మెల్యే సుందరపుల పేర్లు చెప్పి ఇక్కడకు వచ్చిన వారిని బెదిరిస్తున్నారని తెలిపారు. ఫణిగిరి,పంచదార్ల, వెంకటాపురం, భోగాపురం కొండల్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఎటువంటి తీర్మానం చేయకపోయినా పంచాయతీ ఆమోదించినట్లు చెప్పడం దారుణమన్నారు.తహసీల్దార్ వద్ద స్పష్టమైన సమాచారం లేదని ఆయన చెప్పారు. నంబర్ ప్లేట్లు లేని లారీలను ఇక్కడ వినియోగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని తెలిపారు. పుణ్య పంచధారలు కలిగిన ధారపాలెంకు నష్టం కలిగించేలా ఇక్కడ గ్రావెల్ తవ్వకాలు జరపడం శోచనీయమని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం రాయలసీమ వారికి ఉత్తరాంధ్ర కొండల్ని అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందని విమర్శించారు.ఈ ప్రాంత ప్రజల అనుమతి లేకుండా,ఇక్కడి పంచాయతీలకు సీనరైజ్ చెల్లించకుండా చేపడుతున్న దోపిడీపై పోరాటం చేస్తామని వెల్లడించారు.చంద్రబాబు,పవన్ కళ్యాణ్‌ల ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.


