వెన్నుపోటు బాబూ...
వెన్నుపోటుకు రెండేళ్లు.. చంద్రబాబు గద్దెనెక్కి రెండేళ్లయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లాలో అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు గర్జనలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లి జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, మానవహారాలతో వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపట్టారు. ‘సీఎం డౌన్ డౌన్.. లోకేష్ డౌన్ డౌన్‘ అంటూ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు హామీలు ‘గోవిందా.. గోవిందా..’ అంటూ వెన్నుపోటు పోస్టర్లను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రతులను చెత్తబుట్టల్లో, డంపర్ బిన్లలో వేస్తూ, తగలబెడుతూ తమ నిరసనను వినూత్నంగా చాటారు.
కశింకోటలో చంద్రబాబు హామీల కాగితాలు చించి నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజక వర్గ సమన్వయ కర్త మలసాల భరత్‌కుమార్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
రావికమతం మండలం కొత్తకోటలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్‌నాఽథ్
దేవరాపల్లిలో భారీ స్థాయిలో హాజరైన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న మాజీ డిప్యూటీ బూడి ముత్యాలనాయుడు
రాష్ట్రంలో నయ వంచన పాలన టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ ప్రతులను తగలబెట్టి నిరసన తెలిపిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
దద్దరిల్లిన మండల కేంద్రాలు.. ప్రజా నిరసనలతో హోరెత్తిన జిల్లా
దేవరాపల్లిలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు
రావికమతం మండలం కొత్తకోటలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్‌నాథ్
అనకాపల్లి, కశింకోట, రాంబిల్లి మండలాల్లో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్
సాక్షి, అనకాపల్లి : జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ రహదారులపై రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేశారు. చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను బుట్టదాఖలు చేసిందని, నిరుద్యోగులను, మహిళలను, రైతులను దారుణంగా వంచించిందని ఈ సందర్భంగా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో జరిగిన ఆందోళనలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం కొత్తకోటలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టారు. అనకాపల్లి పట్టణం, కశింకోట, రాంబిల్లి మండలాల్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని ప్రతులను దహనం చేశారు. యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి కూడా పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’కు నిరసన ర్యాలీ నిర్వహించారు. దేవరాపల్లిలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ జరిగింది. నాలుగు రోడ్ల కూడలిలోని డా. బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాలుగు రోడ్ల జంక్షన్‌లో నిరసన చేపట్టి, మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. అలాగే కె. కోటపాడు మండలంలో వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–1 మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పాల్గొన్నారు.
చోడవరం నియోజకవర్గంలో చోడవరం, రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట మండలాల్లో నిరసన కార్యాక్రమాలు జరిగాయి. రావికమతం మండలంలో కొత్తకోటలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లపై నిరసన ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం కొత్తకోట కూడలిలో వైఎస్సార్‌పార్టీ శ్రేణులతో కలిసి భారీ మానవహారం నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్లకార్డులతో నిరసన చేస్తూ టీడీపీ మ్యానిఫెస్టో కరపత్రాలను పార్టీ శ్రేణులతో కలిసి చింపి చెత్త బుట్టలలో వేశారు. అదేవిధంగా చోడవరం మండలంలో కొత్తూరు జంక్షన్ వద్ద రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు పాల్గొన్నారు.
అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి టౌన్, కశింకోట మండలాల్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రెండు మండలాల్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ పాల్గొని నిరసన తెలియజేశారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో నిరసన ర్యాలీ జరిగింది. నక్కపల్లిలో, ఎస్.రాయవరం మండలం, అడ్డురోడ్డు జంక్షన్‌లో ఆ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. పాయకరావు పేట మండలంలో రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, నక్కపల్లిలో రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, కోటవురట్లలో మాజీ ఎమ్మెల్సీ, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి దత్తుడు సీతబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పైలా రమేష్ పాల్గొన్నారు.
నర్సీపట్నంలో నర్సీపట్నం టౌన్, నాతవరం, గోలుగొండ, మాకవరపాలెం మండలాల్లో నిరసన కార్యక్రమం జరిగింది. నర్సీపట్నం టౌన్‌లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పాల్గొన్నారు.
యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, రాష్ట్ర కార్యదర్శి బోదెపు గోవింద్ పాల్గొన్నారు. రాంబిల్లి మండలంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.


