అక్రమ తవ్వకాల రుచి మరిగిన పచ్చ నేతలు
నదీ పరివాహక ప్రాంతాలను గుల్ల చేస్తున్న వైనం
చోడవరం ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద జోరుగా తవ్వకాలు, రవాణా
శారదానది నుంచి ఇసుక తరలిస్తున్న ఎడ్లబళ్లు, (ఇన్‌సెట్) ముద్దుర్తి సంగమేశ్వర ఆలయం వద్ద శారదానది లోంచి ఇసుక తరలించేందుకు ఉపయోగించే బెల్లంపెనాలు, ఇసుక లారీలకు లోడు చేస్తున్న దృశ్యం
చోడవరం : నదుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. నచ్చినంత తవ్వుకో...అమ్ముకో..అడిగేదెవరు అన్నంతగా ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి కారణం అధికార పార్టీ నేత అండదండలేనన్నది అందరికీ తెలిసిన విషయమే. జిల్లాలో మేజర్ శారద, మైనర్ శారద, పెద్దేరు, బొడ్డేరు, తాచేరు, సర్పా, తాండవ నదులు ప్రధానంగా ఉన్నాయి. జిల్లాలో ఎక్కడా అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని చోట్ల అక్రమంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసి మరీ రవాణా చేస్తున్నారు. చోడవరం మండలంలో ముద్దుర్తి, గవరవరం, గజపతినగరం, గౌరీపట్నం, లక్ష్మీపురం కల్లాలు, బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట రీచ్‌లలో వందలాది క్యుబిక్ మీటర్ల ఇసుకను రోజూ అక్రమంగా తరలిస్తున్నారు. ముద్దుర్తి సంగమేశ్వరస్వామి ఆలయం వద్ద మేజర్ శారదనదిలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడే గతంతో అధికారులు దాడులు చేసి ఇసుక తరలిస్తున్న బెల్లం పెనాలను స్వాధీనం కూడా చేసుకున్నారు. అయినా ఈ రేవు వద్ద తవ్వకాలు అగలేదు. ఆలయానికి ఆనుకుని ఉన్న రేవులో పూర్తిగా ఇసుక తవ్వేసి లోతు చేశారు. జిల్లాలో పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న ఈ ఆలయం, స్నానాల రేవు ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఇసుక తవ్వకాల వల్ల ఈ పవిత్ర స్నానఘట్టం కూడా నది నీటిలో తెలియని భారీ గోతులుగా ఏర్పడి ప్రమాదకరంగా మారింది.
బెల్లం పెనాల్లో ఇసుక తరలింపు
అన్ని చోట్ల నదుల్లో పొక్లెయిన్‌లు, ఇతరత్రా సాధనాలతో ఇసుక తవ్వేసి ఒడ్డుకు చేరుస్తుంటే ముద్దుర్తి వద్ద మాత్రం బెల్లం తయారు చేసే పెద్దపెద్ద పెనాల్లో ఇసుకను ఒడ్డుకు చేర్చుతున్నారు. ఆలయం ఒడ్డు నుంచి నది అవతల ఒడ్డు, మధ్యలో ఉన్న ఇసుక మేట్లను తవ్వి పెనంలో వేసి ఈదుతూ ఇవతల ఒడ్డుకు తెచ్చి గుట్టలుగా పోస్తున్నారు. ఇక్కడ నుంచి లారీలు, ఎడ్ల బళ్లపై ఇతర ప్రాంతాలకు తరలించి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు.
పట్టించుకోని యంత్రాంగం
ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులు పంచాయతీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కూడా ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగానే రోజూ పెద్దసంఖ్యలో లారీలతో ఇసుక తరలిస్తున్నా వీఆర్‌ఓలు పట్టించుకోకపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అక్రమ రవాణాకు అనుమతులు!
ఎస్.రాయవరం : మండలంలో అనుమతులు ఉన్నాయని చెబుతూ చెరువు మట్టి, కొండ గ్రావెల్ దందా దర్జాగా కొనసాగిస్తున్నారు. మండలంలో అనుమతులు లేకుండా పెదగుమ్ములూరు, సర్వసిద్ది , పెదఉప్పలం, అనుమతులు ఉన్నాయని ఎస్.రాయవరం, పేటసూదిపురం, జేవీపాలెం, లింగరాజుపాలెం గ్రామాల్లో చెరువుల నుంచి మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.
రైతు పొలాలు అవసరం కోసం అనుమతులు ఇచ్చే మట్టిని ఇటుక పరిశ్రమలకు, ప్రైవేటు వెంచర్లకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని తరలించుకుపోతున్నారు. నాలుగు రోజులుగా ఈ చెరువుల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తున్నా అధికారులు కిమ్మనడం లేదు. నాయకులు వత్తిళ్లు కారణంగా ఇరిగేషన్ అధికారులు నిబంధనలు పాటించకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. మండలంలో ఏఈ, మరో ముగ్గురు సిబ్బంది ఉండా 6 చెరువులకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఉన్న చెరువుల్లో సూపర్‌వైజింగ్ చేసే సిబ్బంది లేకపోవడంతో తవ్వకందారులు ఇష్టం వచ్చినట్టు మట్టి తవ్వకాలు చేసి నచ్చినవారి విక్రయించుకుంటూ దందా చేస్తున్నారు. అదే క్రమంలో గ్రావెల్ కూడా పెదగుమ్ములూరులో మేడకొండ, దార్లపూడి చెల్లాపురం లో పోలవరం కాలువ నుంచి, కాపుల వాతాడ కొండనుంచ నిత్యం అవసరం ఉన్న వారు తరలించుకుపోతున్నారు.ఈ సమయంలో గుర్రాజుపేట, రేవుపోలవరం, గుడివాడ, చినఉప్పలం గ్రామాల నుంచి సముద్ర ఇసుకను దోచుకుపోతున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే అనుమతుల రద్దు
నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నవారు మట్టి తవ్వకాలు చేయకపోతే అనుమతులు రద్దు చేస్తాం. చెప్పిన కొలతలు ప్రకారం అనుమతులు తీసుకున్న రైతు పొలాల్లోకే మట్టి తరలించాలి. రాత్రులు మట్టి తవ్వడానికి నిబంధనలు అతిక్రమించినట్టు మా దృష్టికి వస్తే అనుమతులు రద్దుతో పాటు చర్యలు కూడా తీసుకుంటాం.
– ఎస్ కె .అమీనాబాను, ఏఈ, ఇరిగేషన్, ఎస్.రాయవరం మండలం
చర్యలు తీసుకుంటాం
ఇసుక తవ్వకాలకు ఎక్కడా అనుమతి ఇవ్వలేదు. అక్రమ తవ్వకాలు, రవాణా చేసే వారిపై చర్యలు తీసుకుంటాం. నదుల్లోను, ప్రైవేటు భూముల్లో సైతం ఇసుక తవ్వకాలు చేయరాదు. అక్రమ ఇసుక రీచ్‌లపై చర్యలు తీసుకుంటాం.
–రామారావు, తహసీల్ధార్, చోడవరం


