ఐఐఎం విశాఖపట్నం
సాక్షి, విశాఖపట్నం : వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఈ నెల 6, 7 తేదీల్లో ఐఐఎం విశాఖపట్నం ప్రాంగణంలో ఐడియల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ‘ఇంటర్నేషనల్ కాంక్లేవ్ ఆన్ గ్రీన్ ఎకానమీ(ఐసీజీఈ)–2026 సదస్సు జరగనుంది. ‘ఆర్థిక, విధానపరమైన, సాంకేతిక మార్గాలు’ అనే అంశాలపై జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు, విధానకర్తలు, పరిశ్రమల ప్రముఖులు, పరిశోధకులు హాజరుకానున్నారు. సియెర్రా లియోన్‌కి చెందిన భారత హై కమిషనర్ బైస్నాబ్ చరణ్ ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సు ప్రారంభించనున్నారు. వాతావరణ సంరక్షణ కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, న్యాయబద్ధమైన గ్రీన్ ట్రాన్సిషన్ కోసం పబ్లిక్ పాలసీ, ఏఐ ఆధారిత సుస్థిర వ్యవస్థలు వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ, కోపెన్‌హాగన్ బిజినెస్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సు.. పర్యావరణ, సాంకేతిక మార్పుల కాలంలో పటిష్టమైన ఆర్థిక వ్యవస్థల నిర్మాణానికి, విధానపరమైన చర్చలకు కీలక వేదికగా నిలవనుందని ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొ.చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.


